PM Modi: 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి.. 500 ఏళ్లలో ఇదే తొలిసారి

500 ఏళ్ల తర్వాత అయోధ్యలో నేడు రాముడి గుడిలో దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కొత్త ఆలయంలో రామ్ లాలా ప్రతిష్ఠాపన తర్వాత ఇది మొదటి దీపావళి. సహజంగానే ఈసారి సన్నాహాలు కూడా ఘనంగా జరిగాయి. ఈరోజు దీపాల పండుగ మొదలుకొని పుష్పక విమానంలో స్వామి వచ్చేంత వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు సన్నాహాలు కొనసాగాయి. ఇక ఈ కార్యక్రమాలకు అయోధ్య రోడ్లు సిద్ధమయ్యాయి. నగరంలోని వీధులు, కూడళ్ల నుంచి సరయూ నది ఘాట్‌ల వరకు కూడా లైట్లతో వెలిగిపోతున్నాయి. నేడు ఈ ఘాట్ లలో 28 లక్షల దీపాలతో వెలిగించి గతేడాది వెలిగించిన 25 లక్షల గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లు కూడా చేస్తోంది. పర్యాటక శాఖ అయోధ్యను అలంకరించి సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించింది. ఈసారి అయోధ్యలో కాలుష్య రహిత హరిత బాణసంచా కూడా కొత్త నమూనాను సృష్టించారు.
ఈ నేపథ్యంలోనే ట్రస్ట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడి మందిరం అలంకరణలో చైనా వస్తువులను వాడకూడదని నిర్ణయించింది. స్థానికంగా తయారు చేసిన హస్తకళలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి.
పర్యావరణానికి హాని కలగకుండా అయోధ్య బాణాసంచా 120 నుంచి 600 అడుగుల ఎత్తులో ఆకాశంలో వెదజల్లుతుంది. ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు ఈ దృశ్యాన్ని సులభంగా చూడగలుగుతారు. సాయంత్రం సరయూ బ్రిడ్జ్‌పై బాణసంచా కాల్చడమే కాకుండా లేజర్ షో, ఫ్లేమ్ షో, మ్యూజికల్ కంపానిమెంట్ కూడా ప్రదర్శించనున్నారు. రామకథా పార్కు సమీపంలోని హెలిప్యాడ్ వద్ద భారత్ మిలాప్ కార్యక్రమం జరగనుంది. రాముడు, సీత, లక్ష్మణుడు పుష్పక విమానం ద్వారా ఇక్కడికి వస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలుకుతారు. రామకథా పార్కులో శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో సరయూ నది ఒడ్డున 1,100 మంది ప్రత్యేక ‘ఆరతి’ నిర్వహించనున్నారు.
ఇక 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో జరగబోతున్న దీపావళి వేడుకలు చరిత్రాత్మకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇవి రామ్‌లల్లా తన సొంతింటికి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి వేడుకలు అని.. వీటి కోసం ఎన్నో తరాలు వేచి చూసినట్లు తెలిపారు. అయోధ్య రాముడి సన్నిధిలో దీపావళి వేడుకులు కళ్లారా చూడాలని ప్రజలు తరతరాలుగా వేచి చూశారని.. కానీ వాళ్ల ఆశలు నెరవేరలేదని వెల్లడించారు. కానీ ప్రస్తుత తరం ఎంతో అదృష్టం చేసుకుందని.. రామ్‌లల్లా తన జన్మస్థలానికి చేరుకున్న వేళ.. మనమంతా ఘనంగా దీపావళి వేడుకలను నిర్వహించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com