AG Perarivalan: రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

AG Perarivalan: రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీగా ఉన్న పెరరివాలన్‌ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాజీ ప్రధాని రాజీవ్ హత్యకు వాడిన బాంబు పరికరాలను పెరారివాలన్ సమకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ హత్య సమయంలో పెరారివాలన్ వయసు 19 ఏళ్లు మాత్రమే. ఈ కేసులో పెరరివాలన్ దోషిగా తేలాడు. 1998లో అతనికి మరణశిక్ష ఖరారు చేశారు. అయితే, 2014లో సుప్రీంకోర్టు ఆ శిక్షను జీవితకాల శిక్షగా మార్చింది.
31 ఏళ్లుగా పెరారివాలన్ శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. అటు పెరరివాలన్‌ను విడుదల చేయాలని 2018 సెప్టెంబర్‌లో తమిళనాడు ప్రభుత్వం కూడా సిఫార్సు చేసింది. అయితే,ఈ సిఫార్సును గవర్నర్ నిలిపేశారు. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ తీవ్ర జాప్యం చేశారు. ఆర్టికల్ 161 కింద తనను విడుదల చేయాలని తమిళనాడు గవర్నర్‌కు పెరారివాలన్ అభ్యర్ధన పెట్టుకున్నారు కూడా.
దీంతో గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నట్లు సుప్రీం సైతం అభిప్రాయపడింది. పెరారివాలన్ రిలీజ్‌కు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఆర్టికల్ 142 ప్రకారం నిందితుడిని రిలీజ్ చేయడం సమంజసమే అని సుప్రీం అభిప్రాయపడింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 142 అధికరణ ప్రకారం ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
నిజానికి పెరరివాలన్ విడుదలపై ఈ నెల 10వ తేదీలోగా తేల్చాల్సిందేనని సుప్రీంకోర్టు కేంద్రానికి అల్టిమేట్టం ఇచ్చింది. ఒకవేళ కేంద్రం ఎటూ తేల్చకపోతే తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. తదుపరి వాదనలేవీ లేవని కేంద్రం భావిస్తే పేరరివాలన్ విడుదల చేస్తామని కూడా స్పష్టం చేసింది. తమ తరఫున వాదించేందుకు ఎలాంటి అంశాలూ లేవని కేంద్రం తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.
అసలు పేరరివాలన్ విడుదల వ్యవహారంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోందని కూడా సుప్రీం కోర్టు నిలదీసింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి కట్టుబడి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి కదా అని వ్యాఖ్యానించింది. రాజీవ్ హత్య కేసులో పేరరివాలన్ నిందితుడు అనడంపై సరైన వివరాలు కేంద్రం వద్ద లేదని.. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినా, ఆంక్షలు తప్పడం లేదని పెరరివాలన్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
అసలు పెరరివాలన్ విడుదల అధికారాలు ఎవరికి ఉన్నాయి.. కేంద్రానికా, రాష్ట్రానికా అంటూ సుప్రీం ప్రశ్నించింది. ఈ విషయంలో సందిగ్ధం ఉన్నప్పుడు ఆంక్షల చట్రంలో పెరరివాలన్ ఎందుకు చిక్కుకోవాలని ప్రశ్నించింది సుప్రీంకోర్టు బెంచ్. కేసు పూర్వాపరాలు విచారించిన సుప్రీంకోర్టు పెరరివాలన్‌ను విడుదల చేసింది. ఎట్టకేలకు సుప్రీం ఆదేశాలతో విడుదలవడంతో తమిళనాట సంబరాలు చేసుకుంటున్నారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్లుగా వెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు పెరరివాలన్. శిక్షా సమయంలో ఖాళీగా కూర్చోకుండా డీటీపీ కోర్సు నేర్చుకుని అందులో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించాడు. తమిళనాడు ఓపెన్ యూనివర్శిటీ, మహాత్మాగాంధీ కమ్యూనిటీ కాలేజి సహకారంతో వెల్లూరు జైలు.. ఖైదీలకు విద్యా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బాగా చదువుకున్నాడు పెరరివాలన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com