Agneepath Scheme: ఓవైపు నిరసనలు.. మరోవైపు దరఖాస్తులు.. అగ్నిపథ్ అప్డేట్..

Agneepath Scheme: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో వాయుసేనకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. కేవలం నియామక ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59 వేల 960 దరఖాస్తులు వచ్చాయని వాయుసేన అధికారులు తెలిపారు. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్.
ఓ వైపు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో మూడు రోజుల్లోనే ఇన్ని దరఖాస్తులు రావడం చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5వ తేదీన ముగుస్తుందని వాయుసేన అధికారులు వెల్లడించారు. అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను 2022 డిసెంబర్ 11 నాటికి ప్రకటించనున్నారు.
ఆందోళనలు కొనసాగుతున్నా.. ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని త్రివిద దళాలు తేల్చి చెబుతున్నాయి. సాయుధ బలగాల నియామక ప్రక్రియ అగ్నిపథ్ పథకంలో ఎన్సీసీ క్యాడెట్‌లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్ లెఫ్టెనెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ అన్నారు. ఎన్సీసీలో ఏ,బీ,సీ సర్టిఫికేట్ ఉన్నవారందరికి బోనస్పాయింట్లు లభిస్తాయని వెల్లడించారు.
అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈనెల 14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్ల పూర్తయ్యాక వారి 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు కొనసాగిస్తారని పేర్కొంది. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత.. నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో 2022 రిక్రూట్మెంట్లో గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 23 ఏళ్లకు పెంచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com