Agneepath Recruitment: ఆర్మీలో పనిచేయాలనుకునే వారికి గుడ్ న్యూస్! కొత్తగా 'అగ్నిపథ్' స్కీమ్..
Agneepath Recruitment: ఇండియన్ మిలటరీని మరింత శక్తివంతం చేసేందుకు 'అగ్నిపథ్' స్కీమ్‌ను తెరపైకి తెచ్చింది రక్షణ శాఖ.

Agneepath Recruitment: ఇండియన్ మిలటరీని మరింత శక్తివంతం చేసేందుకు 'అగ్నిపథ్' స్కీమ్‌ను తెరపైకి తెచ్చింది రక్షణ శాఖ. దీనికి సంబంధించిన కొత్త డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ మోడల్ రక్షణమంత్రి రాజ్‌నాథ్, త్రివిధ దళాధిపతులతో కలిసి ప్రకటించారు. యువతకు సైన్యంలో పనిచేసేందుకు ఇదో మంచి అవకాశం అని రాజ్‌నాథ్ అన్నారు. 4 ఏళ్ల ఉద్యోగ కాల పరిమితితో 'అగ్నిపథ్' సర్వీస్ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. తొలి బ్యాచ్‌లో 45 వేల మంది సైనికుల్ని రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించారు.
17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు వారు ఈ అగ్నిపథ్‌కు అర్హులు. ఇందులో ఎంపికైన వారికి 6 నెలలు శిక్షణ ఇస్తారు తర్వాత. మూడున్నరేళ్ల సర్వీసు ఉంటుంది. ఈ టైమ్‌లో 40 వేల వరకూ జీతంతోపాటు ఇతర సదుపాయాలు కల్పిస్తారు. ఉద్యోగ సమయంలో 48 లక్షల ఇన్స్యూరెన్స్ కూడా ఉంటుంది. సర్వీసు తర్వాత వన్‌టైమ్ సపోర్ట్ ప్యాకేజీ కింద 11 లక్షల 71 వేలు అందిస్తారు.
అలాగే 'అగ్నివీర్' స్కిల్ సర్టిఫికెట్‌తో మిలటరీలో రిటైర్మెంట్ తర్వాత బయట ఉపాధికి అవకాశం ఉంటుంది. అగ్నిపథ్ సర్వీసులో ఉన్న వారిలో 25 శాతం మందినే పర్మినెంట్ చేస్తారు. అగ్నిపథ్‌లోను సైనికులతో సమానంగా ర్యాంక్‌లు, వేతనాలు అన్నీ ఉంటాయని త్రివిధ దళాధిపతులు వివరించారు. ఈ తరహా రిక్రూట్‌మెంట్ ద్వారా యువత ఎక్కువగా వస్తారని, అలాగే సైన్యాన్ని మరింత ఆధునీకరించే అవకాశం ఉంటుందని చెప్పారు.