Agneepath Scheme: అగ్నిపథ్ పథకంపై నిరసనలతో దిగొచ్చిన కేంద్రం.. మ్యాగ్జిమమ్ ఏజ్ లిమిట్ పెంపు..

Agneepath Scheme: భారత రక్షణశాఖలోని త్రివిద దళాల్లో స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటడంతో కేంద్రం దిగివచ్చింది. అగ్నిపథ్ స్కీమ్‌పై క్లారిటీ ఇవ్వడమే గాక, అప్పర్ ఏజ్ లిమిట్‌ను పొడిగించింది. 21 నుంచి 23 ఏళ్లకు పెంచింది. ఈ ఒక్క ఏడాదికే ఈ మినహాయింపు ఉంటుందని రక్షణ శాఖ తెలిపింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఎలాంటి నియామకం లేకపోవడంతో వన్ టైమ్ వేవర్ కింద రెండేళ్ల సడలింపు ఇస్తున్నట్లు పేర్కొంది. కాగా కొత్త స్కీమ్‌పై నిరసనలు రెండో రోజు దేశంలోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి.
బీహార్‌లో ప్రారంభమైన ఆందోళనలు యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్‌లకు పాకాయి. ఈ ఆందోళనలు కాస్తా రెండో రోజు కాస్తా హింసాత్మకంగా మారాయి. బీహార్‌లో రెండో రోజు ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. భభువా రోడ్ రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు అద్దాలను పగులగొట్టి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఏకంగా కోచ్‌కు నిప్పంటించారు. పట్నా-గయా, పట్నా-బక్సర్ హైవేలను నిరసనకారులు నిర్బంధించారు. ముజఫర్‌పూర్, బక్సార్, బెగూసరాయ్‌లో యువకులు నిరసన వ్యక్తంచేశారు. అటు యూపీ, హర్యానాలో ఆందోళనలు మిన్నంటాయి. నాలుగేళ్ల సర్వీసు తర్వాత తమ పరిస్థితి ఏంటని కేంద్రాన్ని నిలదీశారు.
అటు అగ్నిపథ్ స్కీమ్‌పై కేంద్రం పునరాలోచన చేయాలని రాజకీయపక్షాలు డిమాండ్ చేశాయి. నిరుద్యోగులను అగ్నిపథ్‌లో నడిపించి వారికి సహనానికి అగ్నిపరీక్షపెట్టొద్దని రాహుల్ ట్వీట్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌తో గడువు ముగిసిన 75 శాతం మంది భవిష్యత్ ఏంటన్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం చచెప్పాలని ప్రశ్నించారు చిదంబరం నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు. అగ్నిపథ్ పథకంతో గ్రామీణ యువత నష్టపోతారని యూపీ మాజీ సీఎం మాయావతి విమర్శించింది. అటు దేశ ప్రయోజనాలకు హాని కలిగించేలా ఈ పథకం ఉందని వామపక్షాలు ఆరోపించాయి.
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం ఈ పథకంపై వ్యతిరేకతను తెలియజేస్తూ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. అగ్నిపథ్ స్కీమ్‌పై నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఈ స్కీమ్ సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తొలి ఏడాది ఈ పథకం ద్వారా ఎంపికయ్యే వారి సంఖ్య.. మొత్తం సైన్యంలో 3 శాతమేనని పేర్కొంది. సైన్యంలో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్రం వెల్లడించింది. సైన్యంలోని రెజిమెంటల్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయమని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com