శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ.. 2వేల కోట్ల ఆస్తుల ఫ్రీజ్

శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ.. 2వేల కోట్ల ఆస్తుల ఫ్రీజ్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బినాబీ చట్టం కింద ఆమెకు చెందిన 2వేల కోట్ల ఆస్తులను ఐటీ శాఖ ఫ్రీజ్..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బినాబీ చట్టం కింద ఆమెకు చెందిన 2వేల కోట్ల ఆస్తులను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. చెన్నై పోయెస్‌ గార్డెన్‌లో జయలలిత నివాస గృహానికి ఎదురుగా.. శశికళ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. 300 కోట్ల విలువచేసే ఆ స్థలం శశికళ బినామీ ఆస్తిగా గుర్తించిన ఆదాయపన్ను శాఖ.. అటాచ్ చేసినట్లు ప్రకటించింది. ఈ బినామీ ఆస్తులన్నీ శశికళ, ఇళవరసి, సుధాకరన్ పేర్ల మీద ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటికే శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌లు.. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో బెంగళూరులోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

బోగస్‌ కంపెనీల పేరుతో శశికళ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు ఆస్తులను అటాచ్ చేశారు. 1995న శశికళ శ్రీహరి చందన ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ఓ బినామీ కంపెనీని తెరపైకి తెచ్చినట్టు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేంద్రంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను ఈ కంపెనీ సాగించినట్లు అధికారులు గుర్తించారు. 2003- 05 మధ్య కాలంలో శశికళ 200 ఎకరాలను కొనుగోలు చేసినట్లు ఐటీ శాఖ చెప్పుకొచ్చింది. మొత్తం 65 ఆస్తులను శశికళ కూడబెట్టినట్లు తెలిపింది.

అంతేకాదు, పెద్ద నోట్ల రద్దు సమయంలో 16వందల 74 కోట్ల విలువైన స్థిరాస్తుల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలతో శశికళ.. బంధువులకు లేఖ రాసినట్టు ఐటీ శాఖ ఇప్పటికే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సందర్భంలో శశికళ తన వద్దనున్న కోట్లాది రూపాయల విలువచేసే పెద్ద నోట్లను మార్పిడి చేసుకునేలా స్థిరాస్తులు కొనుగోలు చేశారు. అంతే కాకుండా 237 కోట్ల విలువైన ఆ పాత పెద్దనోట్లను పౌష్టికాహార పథకం కాంట్రాక్టరుకు రుణంగా కూడా ఇచ్చారు. ఈ వివరాలు తాము జరిపిన తనిఖీలలో వెల్లడైనట్టు ఆదాయపు పన్నుల శాఖ ప్రకటించింది.

అక్రమాస్తుల కేసులో..ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్న చిన్నమ్మకు ఇది మరో పిడుగులాంటి వార్తే. బినామీ పేర్లతో.. శశికళకు చెందిన 2వేల కోట్లను ఐటీశాఖ అటాచ్ చేయడం.. తమిళనాడులో మరోసారి కలకలం రేపింది. త్వరలో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‌రాజకీయంగా ఆమెకు ఇదో పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు విశ్లేషకులు. ఇక బెంగళూరులోని పరప్పన జైలులో శిక్ష అనుభిస్తున్న శశికళ.. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్నారు.

Tags

Next Story