GUJARAT RAINS: నీట మునిగిన ఎయిర్‌పోర్ట్‌.. ప్రయాణికుల అవస్థలు

GUJARAT RAINS: నీట మునిగిన ఎయిర్‌పోర్ట్‌.. ప్రయాణికుల అవస్థలు
గుజరాత్‌లో వర్షాల బీభత్సం... నీట మునిగిన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌... తీవ్రంగా ఇబ్బందిపడ్డ ప్రయాణికులు...

గుజరాత్‌(Gujarat)లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు తోడు పోటెత్తిన వరదతో అహ్మదాబాద్‌(Ahmedabad)లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (SVIP) నీట మునిగింది. రన్‌వే సహా, విమానాశ్రయ కారిడార్‌లోకి పెద్దమొత్తంలో నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే నీటిని తోడేసినట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు.


ఎయిర్‌పోర్టులోకి నీరు చేరటంపై పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదానీ సంస్థ నిర్వహిస్తున్న ఎయిర్‌ పోర్టు పరిస్థితి ఇలా ఉందంటూ అంటూ వీడియోలు షేర్‌ చేస్తున్నారు.



కుండపోతతో గుజరాత్‌లోని బొటాద్‌లో పలు ప్రాంతాల్లో భారీగా వరద నిలిచింది. జునాగఢ్‌లో వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి పెద్ద ఎత్తున వరద చేరడం వల్ల వాహనాలు నీట మునిగాయి. దీంతో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అహ్మదాబాద్‌లో రోడ్లు చెరువులను తలపించాయి. దక్షిణ గుజరాత్‌లో డ్యామ్‌లు, నదులలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరగా.. ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. దేవ్‌భూమి ద్వారక, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌, వల్సద్‌ జిల్లాల్లో ఇవాళ కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్‌లో ఆరెంజ్‌ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి వరద పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. సహాయక బృందాలను పంపిస్తామని హామీ ఇచ్చారు.


మరోవైపు... తాజా వరదల కారణంగా పంజాబ్‌లో వెయ్యి కోట్ల నష్టం జరిగిందని సీఎం భగవంత్ మాన్‌ ప్రకటించారు. నష్టాలను సంబంధించిన పూర్తి వివరాల నివేదికను కేంద్రానికి పంపి.. సహాయాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో నష్ట అంచనాలను లెక్కగట్టి.. బాధితులకు పరిహారం చెల్లిస్తామని మాన్‌ హామీ ఇచ్చారు. భాక్రానంగల్‌ డ్యామ్‌లో ప్రస్తుత నీటిమట్టం ప్రమాదకర స్థాయి కంటే కిందే ఉందని వెల్లడించారు. ప్రస్తుతానికేతే ప్రజల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story