Chennai Engineer: ఇష్టపడిన వ్యక్తిని దక్కించుకునేందుకు 12 రాష్ట్రాలను గడగడలాడించిన శాడిస్ట్ ప్రేమికురాలు..

Chennai Engineer: ఇష్టపడిన వ్యక్తిని దక్కించుకునేందుకు 12 రాష్ట్రాలను గడగడలాడించిన శాడిస్ట్ ప్రేమికురాలు..
X
చివరికి ఐపీ అడ్రస్‌తో ఇలా దొరికిపోయింది.

ఉన్నతచదువులు చదివింది.. మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించింది.. నెలకు లక్షల్లో వేతనం.. అదే సంస్థలో ఉద్యోగిని ఇష్టపడింది.. కానీ, అతను ఆమె ప్రేమను తిరస్కరించాడు.. వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, సదరు యువతి మాత్రం ఎలాగైనా అతన్ని తన సొంతం చేసుకోవాలని అనుకుంది. ఎలాగోలా అతన్ని జైలుపాలు చేసి భార్య నుంచి విడిపోయేలా చేయాలని అనుకుంది.. అందుకోసం పక్కా స్కెచ్ వేసింది.. అతని పేరుపై ఫేక్ ఐడీ క్రియేట్ చేసి.. ఐదు నెలల్లో దేశంలో 12 రాష్ట్రాల్లోని వివిధ సంస్థలకు బాంబు బెదిరింపులతో హడలెత్తించింది.. చివరికి ఐపీ అడ్రస్‌తో పోలీసులకు చిక్కింది.. అయితే, ఆమె కథంలో ఆధ్యంతం ట్విస్టులే.. క్రైం థిల్లర్‌ను తలపించే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

చెన్నైకి చెందిన రినే జోషిదా అనే యువతి తొలుత ఇంజనీరింగ్, ఆపై రోబోటిక్స్‌లో అడ్వాన్స్డ్ కోర్సు చేసింది. ఈమె ప్రతిభకు మెచ్చిన మల్టీ నేషనల్ కంపెనీ డెలాయిట్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా తమ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చింది. అదే సంస్థలో పనిచేస్తున్న సహోద్యోగి దివిజ్ ప్రభాకర్ ను రినే జోషిదా ఇష్టపడింది. కొద్దిరోజుల తరువాత ప్రభాకర్ కు తన ప్రేమను తెలియజేసింది. కానీ, అతను ఆమె ప్రేమను తిరస్కరించాడు. ఆ తరువాత కొద్దిరోజులకే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రభాకర్ పై రినే జోషిదా కక్షపెంచుకుంది. తనను ఎలాగైనా తన భార్య నుంచి విడదీయాలని అనుకుంది. ఇందుకోసం ఓ ప్లాన్ వేసింది.

రినే తన ల్యాప్‌టాప్ నుంచి డార్క్‌వెబ్‌ను యాక్సస్ చేసింది. దాని ద్వారానే ప్రభాకర్ పేరు, వివరాలతో ఈ-మెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. వీపీఎన్ ద్వారా ఇంటర్నెట్ ను యాక్సస్ చేసే రినే.. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాలు, కార్పొరేట్ స్కూళ్లు, ఆస్పత్రులకు 22 బెదిరింపు మెయిల్స్ పంపింది. వీటిలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బెదిరింపు మెయిల్ కూడా ఉంది. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ-మెయిల్ ఐడీ ఆధారంగా ప్రభాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణ అనంతరం వదిలేశారు.

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విమానం ఓ మెడికల్ కాలేజీపై కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజే అదే కాలేజీకి పాక్ ఉగ్రవాదుల పేరుతో రినే మెయిల్ పంపించింది. మరో విధ్వంసం తప్పదంటూ ఆ మెయిల్ లో హెచ్చరించింది. దీంతో గుజరాత్ ఏటీఎస్, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేపట్టారు. అప్పటి వరకు 12 రాష్ట్రాలకు వచ్చిన 22 ఈ-మెయిల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి దర్యాప్తు చేశారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో అహ్మదాబాద్‌లోని ఓ స్కూల్‌కు రినే ఇలానే బెదిరింపు మెయిల్ పంపించింది. ఇక్కడే ఆమె దొరికిపోయింది.

ప్రతి సందర్భంలోనూ డార్క్‌వెబ్ ద్వారా, వీపీఎన్ నెట్‌వర్క్ వాడటంతో ఆమె వివరాలు పోలీసులకు చిక్కలేదు. అయితే, అప్పుడు మాత్రం రినే ల్యాప్‌టాప్‌కు తన ఇంటిలోని వైఫై కనెక్ట్ అయింది. ఇది గుర్తించకుండా రినే మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు పంపించింది. గుజరాత్ పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా రినే ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలతోపాటు లొకేషన్ గుర్తించారు. గత వారం చెన్నైలోని ఆమె ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. ఆమె విచారణ చేయగా.. అసలు గుట్టు బయటపడింది. గత ఐదు నెలలుగా ప్రభాకర్ పేరుతో క్రియేట్ చేసిన ఈ-మెయిల్ ఐడీలతో పలు రాష్ట్రాల్లోని సంస్థలకు బాంబు బెదిరింపుల మెస్సేజ్ లు పంపించినట్లు గుర్తించి ఆమెను కటకటాల్లోకి పంపించారు.

Tags

Next Story