Air India: పైలట్ల డ్యూటీ టైమ్ సడలింపు కోరుతూ డీజీసీఏను ఆశ్రయించిన ఎయిర్ ఇండియా

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా విమానయాన సంస్థలు తమ మార్గాలను మార్చుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా... పైలట్ల విమాన విధి నిర్వహణ సమయ పరిమితి (FDTL) నిబంధనల నుంచి తాత్కాలికంగా సడలింపు ఇవ్వాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)ను ఆశ్రయించింది.
కొన్ని సుదూర మార్గాల విమానాలకు ముగ్గురు పైలట్లకు బదులుగా ఇద్దరితోనే నడపడానికి, అలాగే గరిష్ఠ ప్రయాణ సమయాన్ని పెంచడానికి అనుమతి ఇవ్వాలని ఎయిర్ ఇండియా కోరింది. ప్రస్తుతం ఉన్న 10 గంటల గరిష్ఠ ప్రయాణ సమయాన్ని 1 గంట 3 నిమిషాలు పెంచి, సుమారు 11 నుంచి 11.5 గంటలకు పొడిగించాలని అభ్యర్థించింది. అలాగే, గరిష్ఠ ఫ్లైట్ డ్యూటీ పీరియడ్‌ను 13 గంటల నుంచి 1 గంట 45 నిమిషాలు పెంచి, 14 గంటల 45 నిమిషాలకు చేర్చాలని కోరింది.
మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల గగనతలంలో ఆంక్షలు, భారత విమానాలకు పాకిస్థాన్ గగనతలం మూసివేయడం వంటి కారణాలతో విమానాలు అరేబియా సముద్రం, మధ్య ఆసియా మీదుగా సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం, ఇంధన వినియోగం పెరగడమే కాకుండా, సిబ్బంది డ్యూటీ సమయంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే 11 మధ్యప్రాచ్య దేశాల గగనతలాన్ని ప్రమాదకర జోన్లుగా పరిగణిస్తూ, వాటిని వాడొద్దని డీజీసీఏ భారత విమానయాన సంస్థలకు సూచించింది.
ఇరాన్, ఇరాక్ గగనతలాన్ని తప్పించడం వల్ల ఎయిర్ ఇండియా పలు సుదూర విమానాల ప్రయాణ సమయం గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా గత వారం పలు విమానాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రతిపాదనను నియంత్రణ సంస్థ పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఇండిగో వంటి ఇతర విమానయాన సంస్థల నుంచి ఇలాంటి అభ్యర్థనలు ఇంకా రాలేదని అధికారులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
