Congress: నేటినుంచి అహ్మదాబాద్‌లో ఏఐసీసీ సమావేశాలు

అహ్మదాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో జరిగే సమావేశాల్లో పార్టీలో కీలకమైన నాయకత్వం, సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. కీలకమైన రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సమావేశాల్లో ప్రియాంకాగాంధీకి కీలక పాత్ర అప్పగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వస్తున్న వేళ ప్రియాంకా గాంధీని ఎలా ఉపయోగించుకోవాలనే నిర్ణయాన్ని పార్టీ తీసుకోనుంది. ఈ సమావేశంలో సంస్థాగత వికేంద్రీకరణ, కూటమి నిర్వహణ, ప్రజలకు మరింత చేరువయ్యే అంశాలపై చర్చించి.. తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంకా గాంధీ ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని నిర్వహిస్తున్నారు. కానీ నిర్దిష్ట పోర్ట్‌ఫోలియోని కేటాయించలేదు. దీంతో వివిధ రాష్ట్రాల యూనిట్లు, సీనియర్ నాయకులు.. ఆమె రాజకీయ నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని, ఓటర్లతో కనెక్ట్ కావాలని పిలుపునిచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆమె ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రచారాలు నిర్వహించారు.
మంగళవారం జరగబోయే సమావేశంలో పార్టీ వికేంద్రీకరణకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వివాదాస్పద వక్ఫ్ బిల్లుపై వ్యతిరేక తీర్మానం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇండియా కూటమి నిర్వహణ, సమిష్టిగా ప్రధాని మోడీని ఎదుర్కొనే వ్యూహాలకు పదునుపెట్టనున్నారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కి అధ్యక్షుడి ఎన్నికైన 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత గుజరాత్‌లో కాంగ్రెస్ జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 2,000 మందికి పైగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొంటారని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com