AIDS: కబళిస్తున్న మౌన రాకాసి "ఎయిడ్స్"

ఒక్క జిల్లాలోనే 7,400 మందికి ఎయిడ్స్.. అందులో 400 మందికి పైగా చిన్నారులే. బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ విస్తుపరుస్తోంది. ఇది పొరపాటు వలన జరిగిన ఘటన కాదు. ఇదొక సోషల్ స్టిగ్మా. మనం రోగాన్ని చంపడం కంటే కలంకాన్ని పెంచాం. ఇక్కడ హెచ్ఐవీ అంటే వ్యాధి కాదు.. అది “పరువు పోయిన గుర్తు”.టెస్టు చేయించుకుంటే “చెడ్డ పేరు వస్తుంది” అని భయం. పాజిటివ్ వచ్చిందంటే… కుటుంబం నుంచి, గ్రామం నుంచి తరిమేస్తారని భయం. అందుకే లక్షల మంది రోగం లోపలే దాచుకుని చనిపోతున్నారు… బయటకు చెప్పకుండా.వలస వెళ్లిన భర్త నుంచి ఇంట్లో ఉన్న భార్యకు… ఆమె నుంచి పుట్టబోయే బిడ్డకు… ఇలా నిశ్శబ్దంగా వైరస్ ఒక తరం నుంచి మరో తరానికి వ్యాప్తి చెందుతోంది. కానీ మాట మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు.సీతామఢీలో ఒక్క ఏఆర్టీ సెంటర్లోనే 5000 మంది చికిత్స తీసుకుంటున్నారు. ప్రతి నెల 40–60 కొత్త కేసులు. వీరిలో నలభై శాతం మంది… టెస్టు చేయించుకునే ధైర్యం లేక చివరి దశలోనే వస్తున్నారు.ఇది వైద్య సమస్య కాదు… ఇది కలంకం, భయం, మౌనం కలిసి సృష్టించిన నిశ్శబ్ద మహమ్మారి. ఇక్కడ వైరస్‌ను కాదు… మన మనసుల్లోని కలంకాన్ని చంపాలి. అప్పుడే బిహార్‌లో హెచ్ఐవీ చచ్చే రోజు వస్తుంది.
బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో హెచ్ఐవీ కేసులు పెరుగుతుండటం స్థానికంగా ప్రజారోగ్యం పరంగా తీవ్ర ఆందోళనను పెంచుతోంది. సీతామఢీ జిల్లా ఆస్పత్రిలోని ఏఆర్టీ అధికారిక లెక్కల ప్రకారం.. ఆ జిల్లాలో ఇప్పటివరకు 7,400 మందికి పైగా ప్రజలు హెచ్ఐవీ పాజిటివ్ నమోదైనట్లు తెలుస్తోంది. వీరిలో 400 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ఈ పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచే వైరస్ వ్యాప్తి చెందినట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ చిన్నారుల తల్లి, లేదా తండ్రిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ హెచ్ఐవీ పాజిటివ్‌గా ఉండటం వల్ల ప్రసవం
సమయంలోనే ఆ పిల్లలకు హెచ్ఐవీ సోకినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన అధికారులు.. అన్ని రకాల చర్యలు చేపట్టారు. సీతామఢీ జిల్లాలోని ఈ ఒక్క కేంద్రంలోనే నెలకు 40 నుంచి 60 కొత్త ఎయిడ్స్ కేసులు నమోదు అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ఆ జిల్లాలో భారీగా హెచ్ఐవీ కేసులు నమోదు కావడానికి.. అనేక సామాజిక కారణాలు ఉన్నాయని.. వైద్య అధికారులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో హెచ్ఐవీ వ్యాప్తి గురించి సరైన అవగాహన లేదని తెలిపారు. ఎప్పటికప్పుడు ఎయిడ్స్ అవగాహనా ప్రచారాలు నిర్వహించినా ఫలితం కనిపించడం లేదని పేర్కొన్నారు. సీతామఢీ జిల్లాలో హెచ్ఐవీపై ప్రజల్లో చాలా తక్కువగా అవగాహన ఉండటం.. మెడికల్ టెస్టులు లేకుండానే పెళ్లిళ్లు చేసుకోవడం.. ఉపాధి కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు వలసలు వెళ్లడం, సామాజిక వివక్ష కారణంగా ఎయిడ్స్ టెస్ట్‌లు చేయించుకునేందుకు స్థానికులు వెనకడుగు వేయడం వంటి అనేక కారణాల వల్ల హెచ్ఐవీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని డాక్టర్లు గుర్తించారు. సీతామఢీ జిల్లాలోని ఏఆర్టీ సెంటర్లో ప్రతి నెల 40 నుంచి 60 కొత్త కేసులు నమోదు అవుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం దాదాపు 5 వేల మంది రోగులకు ఈ ఏఆర్టీ సెంటర్ మందులు అందిస్తోంది. ఈ పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్ హసీన్ అఖ్తర్.. సీతామఢీ ఇప్పుడు హై లోడ్ హెచ్ఐవీ కేంద్రంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఐవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సీతామఢీ జిల్లా యంత్రాంగం ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. దీంతో ఈ ఏఆర్టీ కేంద్రం కొత్త కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాలను రూపొందిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

