Imphal: ఇంఫాల్ గగనతలంలో కలకలం..

దేశ సరిహద్దులకు సమీపంలో ఇంఫాల్‌లో గాల్లో ఎగిరిన గుర్తుతెలియని వస్తువు కోసం భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. రెండు రఫేల్ యుద్ధవిమానాలతో గాలించింది. దాదాపు 3 గంటలు పౌర విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించిన ఈ ఘటన నేపథ్యంలో చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి గగనతల రక్షణ వ్యవస్థలను వాయుసేన యాక్టివేట్ చేసింది.
మణిపుర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గాల్లో ఎగిరిన గుర్తు తెలియని వస్తువు కోసం భారత వైమానిక దళం గాలిస్తోంది. గగనతల నియంత్రణ వ్యవస్థ-ATC సహా ఇతర వ్యవస్థలు ఇచ్చిన సమాచారంతో భారత వైమానిక దళం-IAF అప్రమత్తమైంది. గాల్లో ఎగిరిన గుర్తుతెలియని ఆ వస్తువును కనిపెట్టేందుకు షిల్లాంగ్ కేంద్రంగా పనిచేసే ఈస్టర్న్ కమాండ్ నుంచి ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని పంపారు. రఫేల్ యుద్ధ విమానం ఇంఫాల్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో గాలించినా ఏమీ కనిపించలేదని వాయుసేన అధికారులు చెప్పారు. అది తిరిగొచ్చిన తర్వాత మరో రఫేల్ యుద్ధవిమానాన్ని కూడా పంపి గాల్లో ఎగిరిన వస్తువు కోసం వెతికారు. అయినా ఏమీ కనిపించలేదని చెప్పారు. వెంటనే చైనా సరిహద్దుల వెంబడి ఉన్నఈస్టర్న్ కమాండ్‌కు సంబంధించిన గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశారు.
ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో గుర్తుతెలియని వస్తువు గాల్లో ఎగరడం ఆదివారం పెద్దకలకలమే సృష్టించింది. నేరుగా అందరి కంటికి కనిపించిన ఈ వస్తువును గమనించిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది గగనతల నియంత్రణ వ్యవస్థ-ATCకి సమాచారం అందించారు. వెంటనే అన్ని పౌర విమానాలను నిలిపివేశారు. దాదాపు 3గంటలు ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు ఆగిపోయాయి. ఇంఫాల్‌కు రావాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. ఇంఫాల్ నుంచి టేకాఫ్ కావాల్సిన 3 విమానాలు ఆలస్యమయ్యాయి. ఈ సందర్భంగా ఇంఫాల్ విమానాశ్రయం వద్ద భారీగా CISF, పోలీసు బలగాలను మోహరించారు. మూడు గంటల గడిచిన తర్వాత అన్ని అనుమతులు ఇవ్వడంతో విమానాశ్రయం నుంచి విమానాలు రాకపోకలు సాగించాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com