Air India: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం.. పొగమంచు ఎఫెక్ట్..

ఢిల్లీ నుంచి న్యూయార్క్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇరాన్ గగనతలం ఆకస్మికంగా మూసివేయడంతో వెనక్కి తిరిగి వచ్చిన విమానం, ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ తర్వాత ప్రమాదానికి గురైంది. ట్యాక్సీవేపై వెళ్తుండగా, విమానం కుడివైపు ఇంజిన్ ఓ లగేజీ కంటైనర్‌ను తనలోకి లాగేయడంతో అది తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే, ఎయిర్ ఇండియాకు చెందిన AI101 విమానం గురువారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి న్యూయార్క్ బయలుదేరింది. అయితే, మార్గమధ్యలో ఇరాన్ గగనతలం మూసివేసినట్లు తెలియడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, పార్కింగ్ బే వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున 5:25 గంటల సమయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉండటంతో ట్యాక్సీవేపై ఉన్న లగేజీ కంటైనర్‌ను పైలట్లు గుర్తించలేకపోయారు.
గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు డీజీసీఏ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బర్డ్ వరల్డ్‌వైడ్ ఫ్లైట్ సర్వీసెస్ (BWFS)కు చెందిన ఓ వాహనం కంటైనర్లను తరలిస్తుండగా, దాని చక్రం ఊడిపోవడంతో ఓ కంటైనర్ ట్యాక్సీవేపై పడిపోయింది. ఆ సమయంలో అటుగా వస్తున్న ఎయిర్‌బస్ A350 విమానం ఇంజిన్, దాని శక్తివంతమైన చూషణతో కంటైనర్‌ను లోపలికి లాగేసింది.
"ఇరాన్ గగనతలం మూసివేత కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చిన విమానం, ట్యాక్సీయింగ్ సమయంలో దట్టమైన పొగమంచులో ఓ బయటి వస్తువును ఢీకొట్టింది. దీంతో కుడివైపు ఇంజిన్ దెబ్బతింది" అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో విమానంలోని 250 మందికి పైగా ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. ప్రస్తుతం దెబ్బతిన్న విమానాన్ని మరమ్మతుల కోసం నిలిపివేశారు. ఈ ఘటనతో కొన్ని A350 సర్వీసులకు అంతరాయం కలగవచ్చని, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

