Air India Express pilot Arrested: ప్రయాణికుడిపై దాడి కేసులో ఎయిరిండియా పైలట్‌ అరెస్ట్‌, రిలీజ్‌

Air India Express pilot Arrested: ప్రయాణికుడిపై దాడి కేసులో  ఎయిరిండియా పైలట్‌ అరెస్ట్‌, రిలీజ్‌
X
సాక్ష్యులు, సాక్షాధారాల ఆధారంగా తదుప‌రి ద‌ర్యాప్తు

ఢిల్లీ విమానాశ్ర‌యంలో కొన్ని రోజుల క్రితం ఓ ప్ర‌యాణికుడిని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ పైల‌ట్ కొట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆ పైలట్‌ను అరెస్టు చేసి, ఆ త‌ర్వాత రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఆ కేసును ఢిల్లీ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పైల‌ట్‌ను వీరేంద్ర సెజ్వాల్‌గా గుర్తించారు. ప్ర‌యాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కెప్టెన్ వీరేంద్ర‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అత‌నిపై న‌మోదు అయిన సెక్ష‌న్లు బెయిల్‌కు అనుకూల‌మైన‌వ‌ని, ఫార్మాల్టీలు ముగిసిన త‌ర్వాత ఆ పైల‌ట్‌ను రిలీజ్ చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు. సాక్ష్యులు, సాక్షాధారాల ఆధారంగా ఈ కేసులో తదుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌ని పోలీసులు వెల్ల‌డించారు.

దాడి ఘటన గురించి ప్రయాణికుడు అంకిత్‌ దివాన్‌ సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేయగా విమానయాన సంస్థ ఈ చర్య తీసుకుంది. తన కుటుంబంతో కలిసి స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణించేందుకు దిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చానని, టెర్మినల్‌-1లో సెక్యూరిటీ చెక్‌-ఇన్‌ వద్ద లైన్‌లో ఉండగా... కొందరు లైన్‌ మధ్యలోకి రావడంపై ప్రశ్నించానని వీడియో ద్వారా అంకిత్‌ దివాన్‌ వెల్లడించారు. ప్రశ్నించినందుకు గాను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పైలట్‌ వీరేందర్‌ సెజ్వాల్‌ దుర్భాషలాడడంతో పాటు తనపై భౌతిక దాడి చేశాడని తెలిపారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాల్సిందిగా బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌కు చెందిన సీన్‌ను రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేసే ప‌నిలో ఢిల్లీలో పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు. ట‌ర్మిన‌ల్ 1 వ‌ద్ద ఉన్న ప‌లు కెమెరాల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. అంకిత్ దీవాన్‌తో పాటు మ‌రికొంత మంది వాంగ్మూలం తీసుకున్నారు. కేసు రిజిస్ట‌ర్ చేసిన త‌ర్వాత నిందితుడికి స‌మ‌న్లు ఇచ్చిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ద‌ర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిన‌ట్లు చెప్పారు. పైలట్ వీరేంద్ర సెజ్వాల్ ద‌ర్యాప్తుకు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. డిసెంబ‌ర్ 19వ తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ట‌ర్మిన‌ల్ 1 వ‌ద్ద సెక్యూర్టీ చెక్ జ‌రుగుతున్న స‌మ‌యంలో అకింత్‌, పైల‌ట్ మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో అంకిత్‌పై పైల‌ట్ దుర్భాష‌లాడుతూ అటాక్ చేశాడు.

Tags

Next Story