Ahmedabad Plane Crash: పరిహారం కోసం ఆర్థిక వివరాలు అడుగుతోందంటూ ఎయిర్ ఇండియాపై ఆరోపణలు

గతనెల అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 272 మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ ఎయిర్ ఇండియా సంస్థ పరిహారం చెల్లిస్తోంది. అయితే, పరిహారం చెల్లింపు కోసం బాధితుల నుంచి సంస్థ ఆర్థిక వివరాలు అడుగుతోందంటూ ఆరోపణలు వస్తున్నాయి.
విమాన ప్రమాద ఘటనలో పరిహారం పొందాలంటే మృతుల కుటుంబాలు ఆర్థిక వివరాలు చెప్పాలంటూ ఎయిర్ ఇండియా సంస్థ బాధితులపై ఒత్తిడి తెస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన న్యాయసంస్థ స్టీవర్ట్స్ ఆరోపించింది. బాధిత కుటుంబాలకు పంపుతున్న ప్రశ్నావళిలో వ్యక్తిగత వివరాలతోపాటు ఆర్థిక సమాచారానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నట్లు తెలిపింది. మృతి చెందిన వ్యక్తిపై దరఖాస్తుదారులు ఆర్థికంగా ఆధారపడి ఉన్నారా..? లేదా..? అని సంస్థ ప్రశ్నించినట్లు పేర్కొంది. దీనిపై అప్పీల్ చేసినట్లు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై ఎయిర్ ఇండియా సంస్థ తాజాగా స్పందించింది. ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
అవన్నీ నిరాధారమైర, అవాస్తవ కథనాలని పేర్కొంది. ‘మేం పంపిన ప్రశ్నావళి కుటుంబ సంబంధాలను ధృవీకరించేందుకే. మృతులతో దరఖాస్తుదారులకు ఉన్న బంధాన్ని తెలుసుకునేందుకే. దీనివల్ల తాత్కాలిక చెల్లింపులు సరిగ్గా చేయగలం. ఇలాంటి విషయాల్లో కొన్ని అధికారిక ప్రక్రియలు అనుసరించాల్సి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇందుకోసం బాధిత కుటుంబాలకు అవసరమైన సమయం ఇస్తున్నాం. వారికి అవసరమైన సాయం, మద్దతు ఇవ్వాలనుకుంటున్నాము’ అని ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
గత నెల 12వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరింది. ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానం ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 242 మంది ఉన్నారు. ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒకే ఒక్కరు ప్రాణాలతో మిగిలారు. ఇక విమానం మెడికల్ కాలేజీకి చెందిన హాస్టల్‌పై పడటంతో అందులోని కొందరు మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా మరణించారు.
మరణించిన ప్రయాణికుల్లో 181 మంది భారతీయులు కాగా, 52 మంది బ్రిటన్ వాసులు. ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియాని నిర్వహిస్తున్న టాటా గ్రూప్ సంస్థ బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ప్రకటించింది. ఆ తర్వాత మరో రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నట్టు పేర్కొంది. బాధిత కుటుంబాల తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అదనపు పరిహారం ప్రకటించినట్టు వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com