Air Pollution: ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన వాయు కాలుష్యం

దేశ రాజధానిలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కరోజులో గాలి నాణ్యత సూచి పడిపోయింది. అక్కడే కాదు వాయు కాలుష్యం కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని చాలా నగరాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నోయిడా, ఘజియాబాద్‌లలో గాలి నాణ్యత చాలా దారుణమైన స్థితికి చేరుకుంది. అక్టోబర్ 16 ఉదయం ఈ నగరాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉంది. చుట్టుపక్కల పొగమంచు కనిపించింది. నోయిడాలో AQI 204 నమోదైంది. అంటే ఇక్కడ గాలి నాణ్యత పేలవమైన స్థితిలో ఉంది. ఇక ఆదివారం ఢిల్లీలోని డీటీయూలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 414 వద్ద నమోదుకావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. ముండ్కాలో ఇండెక్స్ 395కి చేరింది. శనివారంతో పోలిస్తే ఐదురెట్లు ఎక్కువగా నమోదైంది.
నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఘజియాబాద్ జిల్లా లోనిలో కాలుష్యం కారణంగా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ గాలి నాణ్యత సూచిక 235, గా ఆగ్రాలోని సంజయ్ ప్యాలెస్ సమీపంలో గాలి నాణ్యత సూచిక 125. లక్నోలోని లాల్ బాగ్‌లో AQI 142 నమోదైంది. యూపీలోని ఇతర ప్రాంతాలైన బరేలీలో AQI 136 నమోదు చేయబడింది. ఎన్‌ఎస్‌ఐటీ ద్వారకలో 317, వజీర్‌పూర్‌లో 310, ఆనంద్ విహార్‌లో 335 వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగింది. ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GREP) మొదటి దశ అమలు ఉండగా.. వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతున్నది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచి మరింత దిగజారితే రెండో దశలో నియామాలను అమలు చేసే అవకాశం ఉన్నది.
వాయు కాలుష్యంతో భారతీయుల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతుందని ఇటీవల ఓ అధ్యయనం హెచ్చరించింది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది. ప్రస్తుత కాలుష్య స్థాయి ఇదే రీతిలో కొనసాగితే ఢిల్లీ ప్రజలు 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. షికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ‘వాయునాణ్యత జీవన సూచీ (ఏక్యూఎల్‌ఐ)’ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే భారత్ కాలుష్యం చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com