Delhi: ఢిల్లీలో మళ్లీ బెంబేలెత్తిస్తున్న పొల్యూషన్.. పడిపోయిన గాలి నాణ్యత

దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. అనేక చోట్ల వాయు నాణ్యత సూచీ (AQI) 300 మార్కు దాటింది. పటాకుల మోతతో సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 335గా నమోదయింది. ‘వెరీ పూర్’ కేటగిరీలోకి చేరడంతో ఢిల్లీ నగరంతోపాటు రాజధాని ప్రాంత పరిధిలో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-2 (GRAP-2) నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇక ఆనంద్ విహార్ ప్రాంతంలో 414, వాజీపూర్ ప్రాంతంలో వాయు నాణ్యత 407గా నమోదవడంతో సెవర్ కేటగిరీలో చేరాయి.
రానున్న రోజుల్లో కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంతం అప్రమత్తమైంది. దీంతో నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. డీజిల్ జనరేట్లర్లు, కట్టెల పొయ్యిపై నిషేధం విధించారు. అదేవిధంగా దుమ్మును నియంత్రించేందుకు ఎంపిక చేసిన రోడ్లను రోజూ ఊడ్చడం, నీళ్లు చల్లడం వంటి చర్యలు తీసుకుంటారు. వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజారవాణాను ప్రోత్సహించేందుకు సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యతోపాటు మెట్రో సేవల ఫ్రీక్వెన్సీని పెంచుతారు. జీఆర్‌ఏపీ-1 అమల్లోకి వచ్చిన ఆరు రోజుల్లోనే తాజా ఆంక్షలు విధించడం గమనార్హం.
వైద్యుల అభిప్రాయం ప్రకారం… శీతాకాలంలో ఢిల్లీలోని గాలి విషపూరితంగా మారడానికి ప్రతికూల వాతావరణం. వాహనాల ఉద్గారాలు, పంటలు కాల్చడం, బాణసంచా కాల్చడం, స్థానిక కాలుష్య వనరులు కారణం అవుతుంటాయి. ఢిల్లీలోని కలుషిత గాలిని పీల్చడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలు ఉంటాయని.. రోజుకు 10 సిగరెట్లు కాల్చడంతో సమానమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కాలుష్యానికి గురైతే ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని.. అంతేకాకుండాగుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు.
సోమవారం దీపావళి. ఈరోజు భారీగా టపాసులు పేలుస్తారు. గ్రీన్ కాకర్స్ కాల్చేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. వాతావరణం పొలుష్యన్ కారణంగా ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం ఉంది. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ కాకర్స్ కాల్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సమయ పాలన పాటించాలని మాత్రం విజ్ఞప్తి చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com