Ajay Rai Vs Modi ప్రధాని ప్రత్యర్థి అజయ్‌రాయ్

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన నాలుగో జాబితాలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు అజయ్‌రాయ్. బాహుబలి నేతగా పేరొందిన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ను ప్రధాని మోదీపై పోటీకి వారణాసిలో కాంగ్రెస్ మూడోసారి బరిలోకి దింపింది.
సార్వత్రిక ఎన్నికల్లో అందరినీ ఎక్కువగా ఆకర్షించే నియోజకవర్గాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి ఒకటి. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి అక్కడ నుంచి బరిలోకి దిగనుండటమే అందుకు కారణం. ఇక్కడి మోదీకి పోటీగా పూర్వాంచల్‌లో బాహుబలి నేతగా పేరొందిన అజయ్‌రాయ్‌ను కాంగ్రెస్ బరిలో దింపింది. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ చేతిలో అజయ్‌రాయ్ చిత్తుగా ఓడిపోయారు. ఆ రెండు సందర్భాల్లోనూ వారణాసిలో మూడోస్థానానికే పరిమితమయ్యారు. అయినప్పటికీ అజయ్‌రాయ్‌ను మరోసారి మోదీపై పోటీకి దింపడానికి హస్తం పార్టీ భారీ కసరత్తునే చేసింది. మళ్లీ రాయ్‌నే నమ్ముకోవడానికి ఆయన సామాజిక వర్గం కూడా ఓ బలమైన కారణంగా నిలిచింది. భూమిహార్ సామాజిక వర్గానికి చెందిన అజయ్‌రాయ్.. తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో చాలా చోట్ల ఓట్లను ప్రభావితం చేయగలరు. ఒకప్పుడు పూర్వాంచల్ ప్రాంతం కాంగ్రెస్‌కు బలమైన కోటలా ఉండేది. ఇక్కడ మోదీ అడుగుపెట్టడంతో ఆ పార్టీ పునాదులు కదిలాయి. మరోవైపు యూపీ సీఎం యోగి కూడా ఈ ప్రాంతం నుంచే అసెంబ్లీ బరిలోకి దిగారు.
మోదీని ఎదుర్కొనే క్రమంలో రాయ్‌ను మరింత బలోపేతం చేసేందుకు కొన్నాళ్ల క్రితం నుంచే కాంగ్రెస్ చర్యలు మొదలుపెట్టింది. యూపీ పీసీసీ చీఫ్ బ్రిజ్‌లాల్ ఖబ్రీపై అసంతృప్తితో ఉన్న ప్రియాంక గాంధీ బృందం ఆయనను తప్పించి.. పీసీసీ పగ్గాలను రాయ్ చేతికి ఇచ్చింది. దీనివల్ల పార్టీ క్షేత్రస్థాయి ఓటర్లకు మరింత దగ్గరైందని నాయకులు అంచనా వేశారు. దీనికి తోడు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఇండియా కూటమి కింద జట్టు కట్టాయి. భారత్ జోడో, న్యాయ్ యాత్ర సమయంలో కూడా రాయ్ పనితీరు ఆకట్టుకుంది. దీంతో ఈ సారి కూడా మోదీపై పోరుకు రాయ్ పేరునే కాంగ్రెస్ ఎంచుకుంది.
ఏబీవీపీ, సంఘ్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రాయ్‌కు ఎన్నికలు కొత్తేమీ కాదు. గతంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996, 2002, 2007లలో యూపీలోని కొలాస్లా అసెంబ్లీ స్థానం నుంచి భాజపా తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా అజయ్‌రాయ్ ఎన్నికయ్యారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 2009లో సమాజ్‌వాదీ పార్టీలో చేరిన అజయ్‌రాయ్ లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నేత మురళీ మనోహర్ జోషి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్‌తో ఆయన ప్రయాణం 2012లో ప్రారంభమైంది. అదే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అజయ్‌రాయ్ పింద్రా నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిని ఓడించారు. అయితే అజయ్ రాయ్ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పింద్రా నుంచి ఓడిపోయారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి 2009లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున.. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తాజాగా మోదీపై పోటీకి మూడోసారి సిద్ధమయ్యారు. ఈసారి సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా అజయ్‌రాయ్ ఉండటంతో మోదీకి అజయ్‌రాయ్ ఏ మేరకు పోటీనిస్తారో చూడాల్సి ఉంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com