MAHA POLITICS: పతాకస్థాయికి చేరిన ప"వార్"

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. అజిత్ పవార్ ఎన్సీపీ కొత్త అధ్యక్షుడని ఆయన వర్గం ప్రకటించింది. జూన్ 30వ తేదీనే శరద్ పవార్‌ను పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించినట్టు తిరుగుబాటు వర్గం నేత సునీల్ టట్కరే తెలిపారు. ఈ మేరకు అజిత్ వర్గం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. అధ్యక్షుడిగా శరద్ పవార్ స్థానంలో అజిత్ పవార్‌ను ఎన్నుకుంటూ జూన్ 30వ తేదీన జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించినట్టు ఈసీకి సమర్పించిన పిటిషన్‌లో అజిత్ వర్గం పేర్కొంది. మద్దతుగా ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల అఫిడవిట్లను ఈసీకి సమర్పించింది. పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తును తమ వర్గానికి కేటాయించాలని అజిత్ వర్గం ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది.
ఎన్సీపీ పార్టీ పేరు, గుర్తు మార్పుపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన కూడా వినాలని శరద్ పవార్ వర్గం ఈసీని కోరింది. పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కూడా శరద్ పవార్ వర్గం....ఈసీని అభ్యర్థించినట్లు తెలుస్తోంది జూన్ 30న వర్కింగ్ కమిటీ సమావేశం జరిగినట్లు అజిత్ వర్గం పేర్కొనడాన్ని శరద్ పవార్ వర్గం తోసిపుచ్చింది. ఆ సమావేశానికి సంబంధించి పీసీ చాకో, సుప్రియా సూలే, జయంత్ పాటిల్, ఫౌజియా ఖాన్ వంటి కీలక నేతలకు సమాచారమే లేదని తెలిపింది. మరోవైపు, తిరుగుబాటు చేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం నేత జయంత్ పాటిల్ జులై 3న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ఇక తమదే అసలైన పార్టీ అంటూ రెండుగా చీలిపోయిన పవార్ వర్గాలు ఎమ్మెల్యేల బలప్రదర్శనకు దిగాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ వర్గం సమావేశానికి 32 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని, శరద్ వర్గానికి 18 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారని ఆయా వర్గాలు ప్రకటించుకున్నాయి. అనంతరం అజిత్ వర్గం ఎమ్మెల్యేలను ముంబయిలోని ఓ హోటల్‌కు తరలించింది. అయితే, తమకు మెజార్టీ సభ్యుల మద్దతు ఉందని అజిత్ వర్గం పేర్కొంటుండగా పార్టీ ఫిరాయింపు ముప్పు నుంచి బయటపడాలంటే మొత్తం 36 మంది సభ్యుల మద్దతు అవసరం.
ఎమ్మెల్యేల సమావేశంలో అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నానని తెలిపారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న బాబాయి శరద్ పవార్ యూటర్న్ తీసుకోవడంపైనా విమర్శలు చేశారు. 83 ఏళ్ల వచ్చినందున ఇకపై రాజకీయాల నుంచి తప్పుకోవాలని శరద్ పవార్‌కు సూచించారు. కొత్త తరం ఎదిగేందుకు నువ్వు తమకు దారి ఇవ్వాలని అజిత్ పవార్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com