Lok Sabha Polls: ఎన్డీఏ గూటికి పాత మిత్రులు

సార్వత్రిక ఎన్నికల సమరంలో 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న NDA కూటమిలోకి మళ్లీ పాత మిత్రులు వస్తున్నారు. ఎన్డీయే కూటమి విస్తరణపై దృష్టి పెట్టిన భాజపా రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీలోని తెలుగుదేశం పార్టీ కర్ణాటకలోని జేడీఎస్ ఇప్పటికే NDA గూటికి చేరాయి. ఇప్పుడు తాజాగా శిరోమణి అకాళీదళ్ కూడా అదే బాటలో పయనిస్తోంది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో జూన్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పొత్తుల చర్చలను భాజపా-శిరోమణి అకాళీదళ్ SAD పార్టీలు మరింత ముమ్మరం చేశాయి. పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌తో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని భాజపా అధికార ప్రతినిధి ఎస్. ఎస్. చన్నీ తెలిపారు. పొత్తుల ప్రకటనకు మరికొంత సమయం పడుతుందని.. శిరోమణి అకాలీదళ్ మార్చి 22న కోర్ కమిటీ భేటీ నిర్వహించనుందని.. అనంతరం వాళ్లు నిర్ణయం తీసుకోనున్నారని చన్నీ తెలిపారు. ఇరు పార్టీల మర్యాదపూర్వక భేటీ జరిగిందన్న ఆయన... పొత్తుకు సంబంధించి భాజపా అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. అప్పుడు NDA కూటమిలో ఉన్న శిరోమణి అకాళీదళ్... రెండు స్థానాలను గెలుచుకోగా భారతీయ జనతా పార్టీ కూడా రెండు స్థానాలు గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. 2019 ఎన్నికల్లోఆశించిన మేర ఫలితాలు రాకపోయినా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు NDA కూటమి గట్టి పోటీ ఇచ్చింది. 2020 సెప్టెంబర్‌లోకేంద్రం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల కారణంగా శిరోమణి అకాలీదళ్ భాజపాతో సంబంధాలు తెంచుకుంది. NDA నుంచి బయటకు వచ్చేసింది. అనంతరం రైతుల పోరాటంతో దిగివచ్చిన కేంద్రం సాగు చట్టాలను రద్దు చేసింది. అకాలీదళ్ ఎన్డీఏ నుంచి విడిపోయినప్పటికీ జమిలి ఎన్నికలు, పౌరసత్వ సవరణ చట్టం సహా చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిచ్చింది. ఇవన్నీచూస్తే అకాళీదళ్ మరోసారి NDA కూటమిలో చేరడం పక్కా గా కనిపిస్తోంది. ఎన్నికల పొత్తులు సహా అన్ని అంశాలపై చర్చిస్తామని... అకాలీదళ్ ప్రధాన కార్యదర్శి దల్జిత్ సింగ్ చీమా తెలిపారు. భావ సారూప్యత కలిగిన పార్టీతో ఎన్నికల పొత్తు ఉండే అవకాశం ఉందని భాజపాతో పొత్తుపై చీమా పరోక్షంగా స్పష్టత ఇచ్చారు.
అయితే భారతీయ జనతా పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకునే విషయంలో శిరోమణి అకాలీదళ్‌వెనకడుగు వేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. పంటలకు మద్దతు ధర, సిక్కు ఖైదీల విడుదల విషయంలో భాజపా విధానాలను అకాళీదళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. మరోవైపు NDA కూటమిలోకి అకాలీదళ్ వస్తుందన్న వార్తలతో కాంగ్రెస్ విమర్శల పదును పెంచింది. పొత్తు పెట్టుకోవాలన్న శిరోమణి అకాలీదళ్ నిర్ణయాన్ని వారి ఆసక్తికే వదిలేస్తున్నామని పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా తెలిపారు. ..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com