UPSC: యూపీ యువతి కే సివిల్స్ ర్యాంక్..సివిల్స్ 301వ ర్యాంకు వివాదానికి తెర..

సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026లో 301వ ర్యాంకుపై కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి యూపీఎస్సీ తెరదించింది. ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు ఈ ర్యాంకు తమదేనని ప్రకటించుకోవడంతో తీవ్ర చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై యూపీఎస్సీ స్పష్టతనిచ్చింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా అభయ్‌పూర్ గ్రామానికి చెందిన రంజిత్ సింగ్, నీలమ్ సింగ్ దంపతుల కుమార్తె ఆకాంక్ష సింగ్ అసలైన 301వ ర్యాంకర్ అని యూపీఎస్సీ ధ్రువీకరించింది. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది.
సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత ఘాజీపూర్‌కు చెందిన ఆకాంక్ష సింగ్‌తో పాటు బిహార్‌లోని అరా ప్రాంతానికి చెందిన మరో ఆకాంక్ష సింగ్ కూడా 301వ ర్యాంకు సాధించినట్లు మీడియా ముందుకొచ్చారు. ఇద్దరూ తమ అడ్మిట్ కార్డులను చూపిస్తూ ర్యాంకు తమదేనని చెప్పడంతో గందరగోళం మొదలైంది.
ఈ వివాదంపై ఘాజీపూర్‌కు చెందిన అసలైన విజేత ఆకాంక్ష సింగ్ ముందే స్పందించారు. తన ర్యాంకును, గుర్తింపును ఇతరులు దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తన వాదనకు బలం చేకూరుస్తూ అసలైన గుర్తింపు పత్రాలు, ఈ-సమన్ కాపీలను కూడా ఆమె పంచుకున్నారు.
మరోవైపు బిహార్‌లోని అరాకు చెందిన ఆకాంక్ష సింగ్.. ఇది తన రెండో ప్రయత్నమని, ఈసారి ఫలితంపై నమ్మకంతో ఉన్నానని మీడియాకు తెలిపారు. తన తాతయ్య కలను నెరవేర్చానని, రోజూ 8 నుంచి 10 గంటలు చదివానని వివరించారు. ఈమె 2012లో హత్యకు గురైన, నిషేధిత మిలిషియా సంస్థ రణవీర్ సేన వ్యవస్థాపకుడు బ్రహ్మేశ్వర్ సింగ్ కుమార్తె కావడం గమనార్హం. అయితే ఆకాంక్ష సింగ్ ఆన్‌లైన్‌లో ఉంచిన యూపీఎస్సీ అడ్మిట్ కార్డ్, ఇతర పత్రాలు చట్ట విరుద్ధమైనవని యూపీఎస్సీ తన దర్యాప్తులో తేల్చింది. ఆమె అడ్మిట్ కార్డ్‌లో తన రోల్ నం.0856794గా, బార్ కోడ్‌లో అదే రోల్ నంబర్‌ను 0856569గా పేర్కొన్నదని తెలిపింది.
ఈ నెల 6న సివిల్ సర్వీసెస్ 2026 పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో మొత్తం 958 మంది అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) సహా ఇతర గ్రూప్ ఏ, గ్రూప్ బీ కేంద్ర సర్వీసులకు అర్హత సాధించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
