Akhilesh Yadav: మరోసారి కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కానీ ఆ కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ఏర్పాటు చేసినంత ఈజీగా లెక్కలు తేలడం లేదు. దేశంలోని కీలక విపక్ష పార్టీ అయిన సమాజ్‌వాదీ.. ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మరికొన్ని నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అందులో మధ్యప్రదేశ్ కూడా ఉంది. సమాజ్‌వాదీ పార్టీకి ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోనూ కాస్త పలుకుబడి ఉంది. ఈ నేపథ్యంలో.. తాము బలంగా ఉన్న స్థానాల్లో బరిలో దిగుతామని, కాంగ్రెస్ అవకాశం ఇవ్వాలని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఆ మాటలను కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఫలితంగా.. ఇప్పుడు.. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరిపై ఒకరు అభ్యర్థులను దింపుకున్న పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలో కూటమిగా ఉన్నప్పుడు, రాష్ట్రానికి కూడా అది వర్తింపజేయాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంలో సమాజ్‌వాదీ పార్టీ విఫలమవడంతో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌పై తన మాటల దాడిని కొనసాగించారు. కాంగ్రెస్‌ను ద్రోహమని బహిరంగంగా విమర్శించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత.. ఈ గందరగోళం కొనసాగితే ఇండియా కూటమి బీజేపీని ఎప్పటికీ ఓడించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమతో ఎలా వ్యవహరిస్తుందో, తాము కూడా కాంగ్రెస్ విషయంలో అలాగే ఉంటామన్నారు అఖిలేష్ యాదవ్. ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని I.N.D.I.A కూటమిని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌తో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. ఎస్పీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తడంతో ఇండియా కూటమి భవిష్యత్తు అయోమయంలో పడినట్లే కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాధ్ దాటవేత ధోరణితో వ్యవహరించారు. చింద్వారాలో విలేకరులు ఈ విషయం ప్రస్తావించగా అఖిలేష్ విషయం వదిలేయండని అంటూ అఖిలేష్, వఖిలేష్ గురించి మరిచిపోండని వ్యాఖ్యానించారు. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘనవిజయం సాధిస్తామని కమల్ నాధ్ ధీమా వ్యక్తం చేశారు. తాము అంచనాలకు మించి పెద్దసంఖ్యలో తమ అభ్యర్ధులు విజయం సాధిస్తారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com