KHAMENI: మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు

మధ్యప్రాచ్య రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే పరిణామంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం నిలిచింది. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ఇరాన్ రాజకీయ, మత, సైనిక వ్యవస్థలపై ఏకైక ఆధిపత్యాన్ని కొనసాగించిన నాయకుడి మృతి ప్రాంతీయ సమీకరణాలను మాత్రమే కాక, ప్రపంచ శక్తిసామ్యాలను కూడా ప్రభావితం చేసే అవకాశముంది. ఆయన మరణం నేపథ్యంలో ఇరాన్లో అంతర్గతంగా అధికార వారసత్వంపై చర్చలు వేడెక్కుతున్నాయి. అదే సమయంలో పశ్చిమాసియాలో భవిష్యత్తు ఉద్రిక్తతలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది.
36 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యం
అలీ ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్‌లోని పవిత్ర నగరం మషాద్‌లో జన్మించారు. మతపరమైన కుటుంబంలో పుట్టిన ఆయన తండ్రి జావద్ ఖమేనీ ప్రముఖ ఇస్లామిక్ పండితుడు. బాల్యంలోనే మతపాఠాలు అభ్యసించిన ఖమేనీ, తరువాత ఉన్నత విద్య కోసం ఓమోకు వెళ్లారు. అక్కడ ఆయన ఇస్లామిక్ సిద్ధాంతాలపై లోతైన అధ్యయనం చేసి, తరువాతి రాజకీయ జీవితం కోసం బలమైన ఆలోచనా పునాది వేసుకున్నారు. 1960లలో ఇరాన్లో పహ్లావీ రాజరికానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ముమ్మరమైన సమయంలో ఖమేనీ, అప్పటి మతప్రముఖుడు ఖమేనీ ప్రభావంతో విప్లవ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. రాజరిక వ్యతిరేక కార్యకలాపాల కారణంగా పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు. ఈ కాలమే ఆయనను కఠిన వైఖరికి, మతపరమైన రాజకీయాల వైపు మలిచింది. 1979లో ఇస్లామిక్ విప్లవం విజయవంతమైన తరువాత ఖమేనీకి కీలక బాధ్యతలు అప్పగించబడ్డాయి. రివల్యూషనరీ కౌన్సిల్ సభ్యుడిగా, డిప్యూటీ రక్షణ మంత్రిగా ఆయన కీలక పాత్ర పోషించారు. 1981లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మత గురువుగా ఆయన చరిత్ర సృష్టించారు. రెండు సార్లు అధ్యక్షుడిగా సేవలందించారు.
సుప్రీం లీడర్‌గా పూర్తి ఆధిపత్యం
సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఖమేనీ ఇరాన్ పాలనా వ్యవస్థలో మత గురువుల ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేశారు. దేశ సైన్యం, న్యాయవ్యవస్థ, మీడియా, కీలక నియామకాలు అన్నీ ఆయన నియంత్రణలోనే ఉండేవి. ముఖ్యంగా ఐఆర్జీసీకు అపార అధికారాలు కట్టబెట్టి, దేశీయ–విదేశాంగ విధానాల్లో ప్రధాన శక్తిగా తీర్చిదిద్దారు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమం కూడా ఐఆర్జీసీ ఆధ్వర్యంలోనే నడిచింది. ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలకు నాయకుడిగా ఎదిగిన ఖమేనీ, పాలస్తీనా అంశంపై కఠిన వైఖరి తీసుకోవడం ద్వారా సున్నీ ముస్లింలలోనూ ప్రాధాన్యత సంపాదించారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు చేయడం ఆయన రాజకీయ ధోరణిలో ముఖ్యాంశం.
అంతర్గత సవాళ్లు
ఖమేనీ పాలనలో ఇరాన్ సైనికంగా, వ్యూహాత్మకంగా బలపడినప్పటికీ, అంతర్గత అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. 2009లో అధ్యక్ష ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలతో నిరసనలు చెలరేగాయి. 2017, 2019లో ఆర్థిక ఆంక్షల ప్రభావంతో ధర పెరగడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. 2022లో యువతి మరణం నేపథ్యంలో హిజాబ్ వ్యతిరేక ఉద్యమాలు అల్లర్లకు దారితీశాయి. ఈ నిరసనలను అణచివేసే క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయంగా కూడా ఇరాన్‌పై ఆంక్షలు, అణు కార్యక్రమంపై వివాదాలు కొనసాగాయి. నియంతృత్వ పాలన నుంచి విముక్తి కోరుతూ కొంతమంది ఇరాన్ వాసులు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఆశ్రయించిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి.ఇరాన్ రాజకీయాలపై అచంచల ముద్ర వేసిన ఖమేనీ మృతి, ఒక యుగానికి ముగింపు పలికింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
