Time Magazine: ‘టైమ్ 100’లో భారతీయులు

ప్రతిష్ఠాత్మక ‘టైమ్స్ 2024’ ప్రపంచ ప్రభావశీల టాప్-100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు.
అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్ జిగర్ షా, యేల్ విశ్వవిద్యాలయంలో ఖగోళ, భౌతికశాస్త్రాల ప్రొఫెసర్ ప్రియంవదా నటరాజన్, భారత సంతతికి చెందిన రెస్టారెంటు యజమాని అస్మా ఖాన్, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ సతీమణి యులియా ఈ జాబితాలో ఉన్నారు.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ప్రొఫైల్‌ను యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ వివరించారు. సవాళ్లతో కూడుకున్న అత్యంత ముఖ్యమైన సంస్థను మార్చే నైపుణ్యం, ఉత్సాహం కలిగిన వ్యక్తిని గుర్తించడం అంత సులభమైన పనికాదని, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అజయ్ బంగా ఆ పనిని చేసి చూపిస్తున్నారని యెల్లెన్ అన్నారు. బ్యాంక్ అకౌంట్లు లేని లక్షలాది మందిని డిజిటల్ ఎకానమీలోకి తీసుకువచ్చారని కొనియాడారు. పేదరికం లేని ప్రపంచాన్ని సృష్టించాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.
అలియా భట్ ప్రొఫైల్‌ని దర్శకుడు, నిర్మాత, రచయిత అయిన టామ్ హార్పర్ వివరించారు. అలియా భట్ ను ప్రతిభ కలిగిన మహిళగా అభివర్ణించారు. ఆమె ప్రపంచ ప్రముఖ నటులలో ఒకరుగా మాత్రమే కాదని, ఆమె ఒక వ్యాపారవేత్త, నిజాయతీ కలిగిన పరోపకారి అని టామ్ హార్పర్ పేర్కొన్నారు.
ఇక ‘మన భవిష్యత్తును రూపొందించడంలో ప్రభావిత వ్యక్తి’ అని సత్య నాదెళ్లను టైమ్స్ కొనియాడింది. మరోవైపు సాక్షి మాలిక్ కూడా అత్యంత ప్రభావశీల వ్యక్తి అని టైమ్స్ మ్యాగజైన్ పేర్కొంది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సాక్షి మాలిక్ సీనియర్ రెజ్లర్లతో కలిసి ధర్నా నిర్వహించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com