AYODHYA: దేశమంతా శ్రీరామ నామస్మరణ

AYODHYA: దేశమంతా శ్రీరామ నామస్మరణ
అయిదో రోజూ కొనసాగుతున్న ఆచార క్రతువులు.... ప్రపంచంలోనే అతిపెద్ద మట్టి దీపం వెలిగించిన పూజారులు

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న సంప్రదాయ ఆచార క్రతువులు ఐదో రోజుకు చేరాయి. ఇవాళ...... రామమందిర గర్భగడిని సరయూ నది పుణ్యజలాలతో వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆచార్యులు శుద్ధి చేయనున్నారు. అనంతరం వాస్తుశాంతి, అన్నదివాస కార్యక్రమాలను నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం ప్రపంచంలోనే అతిపెద్ద మట్టి దీపాన్ని మందిర ప్రాంగణంలో వెలిగించారు. 1.25 క్వింటాళ్ల దూది, 21వేల లీటర్ల నూనె ఇందుకు ఉపయోగించారు. దేశంలోని పవిత్రస్థలాల్లోని మట్టి, నదీజలాలు, ఆవుపేడతో ఈ ప్రమిదను తయారు చేశారు. తర్వాత.. సరయూనది ఘాట్‌పై హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. అయోధ్యకు వెళ్లిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లపై సమీక్షించారు. హనుమాన్‌ గరీ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. రంగవళ్లులు, పూలతో అలంకరించిన వాకిళ్లు దర్శనమిస్తున్నాయి.


హనుమంతుడి జన్మస్థలిగా భావిస్తున్న కిష్కింద నుంచి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. కర్ణాటకలోని హంపీ సమీపంలో ఉన్న కిష్కింద నుంచి బయలుదేరిన ఈ రథం మార్గమధ్యలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శించుకుంటూ అయోధ్యకు చేరింది. సీతమ్మ జన్మస్థలిగా చెబుతున్న నేపాల్‌లోని జనక్‌పురికి కూడా ఈ రథం వెళ్లి దర్శించుకుంది. దాదాపు వంద మంది భక్తుల బృందం..రాముడి చిత్రాలు ఉన్న కాషాయ జెండాలు ప్రదర్శిస్తూ.. జై శ్రీరాం అని నినదిస్తూ ఈ రథం వెంట పయనించారు. మూడేళ్ల క్రితం చేపట్టిన ఈ యాత్రను రామయ్య ప్రాణ ప్రతిష్ట నాటికి అయోధ్య చేరేలా ప్రణాళిక రచించామని శ్రీ హనుమాన్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధి అభిషేక్‌ కృష్ణశాస్త్రి తెలిపారు.


మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడిపై ఉన్న అచంచల భక్తిని ఓ సాధువు.. వినూత్న రీతిలో చాటుకుని ఆశ్చర్యానికి గురిచేశారు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌కు చెందిన సీర్ బద్రి అనే సాధువు.. రాముడి చిత్రాన్ని ఉంచిన ఓ ట్రక్కును తన జుట్టుతో లాగుతూ.. 566 కిలోమీటర్ల దూర ప్రయాణాన్ని ప్రారంభించారు. దామోహ్‌ నుంచి అయోధ్య వరకు ఈ ప్రయాణం సాగుతోందని బద్రి చెప్పారు. జనవరి 11న ఈ క్లిష్ట ప్రయాణం ప్రారంభించిన ఆయన.. రోజుకు 50 కిలోమీటర్ల చొప్పున జుట్టుతో రథాన్ని లాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చేరుకున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయితే.. రామయ్య రథాన్ని లాగుతూ కాలినడకన మందిరానికి వస్తానని 1992లో ప్రతిజ్ఞ చేశానని బద్రి చెప్పారు.

మరోవైపు... అయోధ్యలో శ్రీ రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈనెల 22న తెలంగాణలో సెలవు ప్రకటించాలని భాజపా ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న ఆయన.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణను శుద్ధి చేసిన బండిసంజయ్‌.. పిచ్చి మొక్కలు తొలగించారు. శ్రీరాముడు అందరివాడన్న ఆయన.. భాజపాను ఆపాదించి ఈ విషయం వివాదాస్పదం చేయటం సరికాదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story