Allahabad HC: రేప్‌ బాధితురాలికి అబార్షన్‌ చేసుకునే హక్కు

Allahabad HC:  రేప్‌ బాధితురాలికి అబార్షన్‌ చేసుకునే హక్కు
X
అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..

అత్యాచార బాధితురాలికి వైద్యపరంగా గర్భవిచ్ఛితి చేసుకునే హక్కు చట్టపరంగా ఉందని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టంచేసింది. బిడ్డను కనాలో వద్దో నిర్ణయించుకునే అధికారం బాధితురాలికి ఉందని తెలిపింది. గర్భవిచ్ఛితిని కోరుతూ ఓ బాలిక దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ జరిపింది. అత్యాచార బాధితురాలికి అబార్షన్‌ చేసుకునే హక్కు మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌లోని సెక్షన్‌ 3(2) కల్పిస్తుందని ధర్మాసనం పేర్కొంది. లైంగిక దాడి కేసులో ఒక మహిళకు గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వకపోవడం, బలవంతంగా ఆమెకు మాతృత్వ బాధ్యతలు కట్టబెట్టడం గౌరవప్రదంగా జీవించే హక్కును ఆమెకు లేకుండా చేయడమేనని తెలిపింది.

17 ఏళ్ల బాలిక తనకు బిడ్డ కావాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈ కామెంట్స్ చేసింది. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు గర్భాన్ని వైద్యపరంగా తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు మహేష్ చంద్ర త్రిపాఠి, ప్రశాంత్ కుమార్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది.

లైంగిక వేధింపుల బాధితురాలు తన గర్భాన్ని వైద్యపరంగా ముగించే హక్కును మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలోని సెక్షన్ 3(2) కల్పిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ‘‘లైంగిక వేధింపుల కేసుల్లో, గర్భాన్ని వైద్యపరంగా నిరాకరించే హక్కుని, ఆమె మాతృత్వ బాధ్యతలను అప్పగించే హక్కుని తిరస్కరించడం అంటే, ఆమె శరీరం పట్ల గౌరవంగా జీవించే మానవహక్కుని తిరస్కరించడమే అవుతుంది. ఎందుకంటే ఆమె తల్లి కావాలా లేదా..? అని చెప్పడం కూడా ఇందులో ఉంటుంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలోని సెక్షన్ 3(2) గర్భాన్ని తొలగించుకునే హక్కుని ఇస్తుంది. లైంగిక వేధింపులకు గురైన మహిళని, నిందితుడి బిడ్డకు జన్మనివ్వమని బలవంతం చేయడం వల్ల ఆమె తీవ్రమైన బాధకు గురవుతుందని కోర్టు చెప్పింది. నిందితుడు, తనను పారిపోదామని ప్రలోభపెట్టి, లైంగికంగా వాడుకున్నాడని బాలిక కోర్టుకి తెలిపారు. ఆమె తండ్రి ఫిర్యాదుతో బాలిక ఆచూకీ కనుగొన్నారు.

బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె 3 నెలల 15 రోజుల గర్భవతి అని తేలింది. ఆమెపై నిందితుడు పలుమార్లు అత్యాచారం జరిపినట్లు పిటిషనర్ తరుపు న్యాయవాది ఆరోపించారు. బాలిక ఇప్పుడు 19 వారాల గర్భవతి కాబట్టి, గర్భం ఆమెకు వేదను కలిగిస్తోందని, ఆమె మానసిక ఆరోగ్యానికి హానికరమని బాలిక తరుపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ మైనర్ కావడంతో పిల్లల బాధ్యతను కోరుకోవడం లేదని చెప్పారు.

మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, రూల్స్ 2003 (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) రూల్స్, 2021)లోని రూల్ 3 బి ప్రకారం.. లైంగిక వేధింపులు, అత్యాచారం, వావివరసలు తప్పడం వల్ల మహిళ గర్భం దాల్చడం లేదా ఆమె మైనర్ అయితే 24 వారాల వరకు గర్భాన్ని తొలగించుకోవచ్చని కోర్టు చెప్పింది. ఇలాంటి పరిస్థితులలో సుప్రీంకోర్టు మరియు ఢిల్లీ హైకోర్టు గర్భాన్ని వైద్యపరంగా ముగించడానికి అనుమతించిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, లైంగిక వేధింపుల కారణంగా గర్భం దాల్చిన బిడ్డను ఉంచుకోవడం లేదా వద్దునుకునే హక్కు బాధితురాలికి ఉంటుందని కోర్టు పేర్కొంది.

Tags

Next Story