High court : లివిన్ తో వివాహ వ్యవస్థ నాశనమే

High court :  లివిన్ తో వివాహ వ్యవస్థ నాశనమే
సీజనల్ గా భాగస్వామిని మార్చేదే సహజీవనం- అలహాబాద్ హైకోర్టు

యువతీ, యువకుల సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు మండిపడింది. భారత దేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని అభిప్రాయపడింది. సహజీవనం చేసిన యువతిపై అత్యాచారం కేసులో యువకునికి బెయిలు మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. లివ్-ఇన్ రిలేషన్స్‌పై అలహాబాద్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి ఇదో ఒక క్రమబద్ధమైన రూపకల్పన అని వ్యాఖ్యానించింది. వివాహం అనేది యువతీ, యువకులకు భద్రత, సామాజిక ఆమోదం, స్థిరత్వాలను ఇస్తుందని, వీటిని సహజీవనం అసలు ఇవ్వదని చెప్పింది.

జస్టిస్ సిద్ధార్థ్ నేతృత్వంలోని అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల అద్నాన్ అనే యువకునికి బెయిలు మంజూరు చేసింది. అద్నాన్‌తో సహజీవనం చేసిన యువతి ఉత్తర ప్రదేశ్‌లోని సహరాన్ పూర్‌లో కేసు దాఖలు చేశారు. తామిద్దరమూ ఓ ఏడాది నుంచి సహజీవనం చేస్తున్నామని, తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, తనతో చనువుగా ఉన్నాడని, తీరా తాను గర్భవతినయిన తర్వాత మోసం చేశాడని, తనను పెళ్లి చేసుకోలేదని ఆరోపించారు. అద్నాన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌‌లో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం సహజీవనం విధానాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది.


జస్టిస్ సిద్ధార్థ్ తీర్పు చెప్తూ ప్రతి సీజన్‌లోనూ సహజీవన భాగస్వామిని మార్చే కిరాతక విధానాన్ని సుస్థిరమైన, ఆరోగ్యవంతమైన సమాజానికి హాల్‌మార్క్‌గా పరిగణించలేమని తెలిపారు. ఈ విషయంలో మన దేశంలో మధ్య తరగతి ప్రజల నైతికతను పట్టించుకోకుండా ఉండలేమన్నారు. అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకుంటున్న దేశాల్లో వివాహ వ్యవస్థను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారిందని, అదే విధంగా మన దేశంలో కూడా వివాహ వ్యవస్థ పాతబడినపుడు, వాడుకలో లేనపుడు మాత్రమే సహజీవనం సాధారణమేనని పరిగణించవచ్చునని తెలిపారు. ఇటువంటి ధోరణితో మనం మన భవిష్యత్తులో తీవ్రమైన సమస్యను సృష్టించుకుంటున్నామన్నారు. సహజీవనం వల్ల కలిగే దీర్ఘకాలిక పర్యవసానాల గురించి తెలియకపోవడం వల్ల యువత ఇటువంటి సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags

Read MoreRead Less
Next Story