Allahabad High Court: అరెస్టుకు కారణాలు తెలపడం తప్పనిసరి

Allahabad High Court: అరెస్టుకు కారణాలు తెలపడం తప్పనిసరి
X
అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..

రాజ్యాంగంలోని 22(1) అధికరణ ప్రకారం అరెస్టు చేసిన సమయంలో నిందితుడికి అందుకు గల కారణాలు తెలపడం తప్పనిసరని అలహాబాద్‌ హైకోర్టు ఇటీవల ఓ తీర్పులో స్పష్టం చేసింది. బెయిల్‌ ఇవ్వడానికి చట్టపరమైన ఆభ్యంతరాలు ఉన్నప్పటికీ రాజ్యాంగ ఉల్లంఘనే బెయిల్‌ మంజూరుకు ప్రధాన కారణంగా నిలుస్తుందని తెలిపింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాంపూర్‌ మెజిస్ట్రేట్‌ నిరుడు డిసెంబర్‌లో ఇచ్చిన ఉత్తర్వును పక్కనపెట్టిన హైకోర్టు తనను అరెస్టు చేయడానికి కారణాలు ఏమిటో తనకు తెలియచేయలేదన్న పిటిషనర్‌ వాదనను ప్రధానంగా ప్రస్తావించింది. మంజీత్‌ సింగ్‌ అనే వ్యక్తిపై 2024 ఫిబ్రవరి 15న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. డిసెంబర్‌ 26న పిటిషనర్‌ను అరెస్టు చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా ప్రింటెడ్‌ రిమాండ్‌ ద్వారా నిందితుడిని జుడిషియల్‌ రిమాండ్‌కు పంపించారు.

అరెస్టుకు గల కారణాలను తెలియచేయకుండా తనను జుడిషియల్‌ రిమాండుకు పంపించారని మంజీత్‌ సింగ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ మహేష్‌ చంద్ర త్రిపాఠి, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం మెజిస్ట్రేట్‌ ఉత్తర్వులను తప్పు పట్టింది. అరెస్టుకు గల కారణాలను తెలియచేయడం రాజ్యాంగంలోని 22(1) అధికరణ కింద తప్పనిసరని తెలిపింది.

నిందితుడిని రిమాండ్‌కు తరలించే ముందు ఆ వ్యక్తికి గల రక్షణలను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మెజిస్ట్రేట్‌కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 22(1) అధికరణ ఉల్లంఘన జరిగినట్లు తేలినపుడు తక్షణమే నిందితుడి విడుదలకు ఆదేశాలు జారీ చేయాల్సిన బాధ్యత కోర్టుకు ఉందని తెలిపింది. బెయిల్‌ మంజూరు చేసేందుకు చట్టపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ 22(1) అధికరణ ఉల్లంఘనే బెయిల్‌ మంజూరుకు ప్రధాన ఆధారంగా చూడాలని ధర్మాసనం పేర్కొంది. అరెస్టు అయిన వ్యక్తులకు అర్థమయ్యే రీతిలో ఎందుకు అరెస్టు చేస్తున్నామో లిఖితపూర్వకంగా సమాచారం అందచేయాల్సిన తప్పనిసరి బాధ్యత పోలీసులకు ఉంటుందని చెప్పింది.

ఈ కేసులో పిటిషనర్‌కు బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్‌ 47 కింద తన అరెస్టుకు గల కారణాలను అందచేయలేదని, కారణాలు లేని అరెస్టు మెమోను మాత్రం అందచేశారని కోర్టు తెలిపింది. అరెస్టు చేసిన వ్యక్తిని జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచినపుడు 22(1) అధికరణ కింద నిబంధనలు పాటించారో లేదో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మెజిస్ట్రేట్‌కు ఉంటుందని, దాని ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకున్న వెంటనే నిందితుడిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపింది. ఇతర బెయిల్‌ నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ ఇదే బెయిల్‌ మంజూరుకు ప్రధాన ఆధారంగా మారుతుందని హైకోర్టు వివరించింది. 2024 డిసెంబర్‌ 26న మెజిస్ట్రేట్‌ జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెడుతూ ఏప్రిల్‌ 9న తీర్పు ఇచ్చిన హైకోర్టు, పిటిషనర్‌ అరెస్టును కొట్టివేసింది.

Tags

Next Story