Amarnath Yatra : అమర్‌నాథ్ భక్తులకు అలర్ట్.. యాత్ర నిలిపివేత

రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్ము కశ్మీర్‌లోనూ కుండపోత వర్షాలతో పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ వర్షాలకు అమర్‌నాథ్ యాత్ర కు తాత్కాలిక బ్రేక్ పడింది. కశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా ముందు జాగ్రత్త చర్యగా అమర్‌నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి బుధవారం ప్రకటించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బాల్తాల్ బేస్ క్యాంప్ మార్గాల్లో యాత్రికులను అనుమతించట్లేదు. ఈ ఏడాది జులై 2న ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజులపాటు సాగనుంది. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 3.93 లక్షల మంది మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మందికిపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com