అమర్నాథ్ యాత్రకు సన్నాహాలు పూర్తి

అమర్నాథ్ యాత్రకు సన్నాహాలు పూర్తి
మూడు లేయర్ల సెక్యూరిటీ వ్యవస్థతోపాటు, గతంలో కంటే ఎక్కువ రోడ్లలో సిసి టీవీ కెమెరాలను అమర్చినట్టుగా వివరించారు.

జూలై 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు సన్నాహాలు చాలా వరకు పూర్తయ్యాయని జమ్మూ అండ్ కాశ్మీర్ అధికార యంత్రాంగం ప్రకటించింది. మూడు లేయర్ల సెక్యూరిటీ వ్యవస్థతోపాటు, గతంలో కంటే ఎక్కువ రోడ్లలో సిసి టీవీ కెమెరాలను అమర్చినట్టుగా వివరించారు.

అమర్నాథ్.. శివయ్య తన భక్తులకు మంచు రూపంలో దర్శనం ఇచ్చే పవిత్ర పుణ్యక్షేత్రం. ఎత్తయిన పర్వతాల మధ్య ఉండే క్షేత్రాన్ని దర్శించే అవకాశం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు. అయితే ఈ దర్శనం ఏడాదిలో రెండు నెలలు మాత్రమే ఉంటుంది. యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 17వ తేదీన ప్రారంభం కాగా 62 రోజుల పాటు జరిగే ఈ యాత్ర జూన్ 1వ తేదీన ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్యం దృష్ట్యా తీసుకోవాల్సిన ఆహారంపై అమరనాధ్ దేవస్థానం పలు కీలక సూచనలు చేసింది. ఈట్ రైట్ పేరుతో తీసుకోవాల్సిన ఆహారాన్ని, నిషేధించాల్సిన ఆహార పదార్థాల జాబితాలను విడుదల చేసింది. గత సంవత్సరం అమర్నాథ్ యాత్రలో దాదాపు 42 మంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతోనే మరణించారు. అందుకే ఈసారి ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా ఆరోగ్య దృవీకరణ పత్రం సమర్పించాలని కోరడంతో పాటు, యాత్రికుల ఆహార విషయంలో కూడా కొన్ని నియమా నిబంధనలను ఏర్పాటు చేసింది. మతపరమైన కారణాలతో మాంసాహారం, మత్తు పదార్థాలు, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు వంటి వాటిపై నిషేధం ఉండగా, ముందు జాగ్రత్తగా పూరీలు, సెనగల కూర, పిజ్జా, బర్గర్లు, దోసలు, హల్వా, రసగుల్లా, పకోడీ లాంటివి కూడా అనుమతించట్లేదని ప్రకటించింది.

ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ పరిపాలన విభాగం కూడా అమరనాథ్ యాత్రలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ల సెలవులను రద్దు చేసినట్టుగా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. యాత్రను సాధారణంగా రెండు మార్గాల ద్వారా అనుమతిస్తారు. ఈ రెండు మార్గాలలోనే భద్రత కట్టుదిట్టం చేశారు. సంబంధిత అధికారులు సెక్యూరిటీ ఏజెన్సీలకు కూడా అవసరమైన సూచనలు చేశారు. అమర్నాథ్ స్వయంగా వెళ్లి దర్శించుకోలేని భక్తుల కోసం అక్కడ జరిగే ఉదయం, సాయంత్రం హారతి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరోవైపు యాత్రకు సంబంధించిన సన్నాహాలు, భద్రతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్ర దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఇటీవల నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు.

Tags

Next Story