Amazon Diagnostic Tests: కొత్త సర్వీస్ ప్రారంభించిన అమెజాన్ .. ఇకపై ఇంటి దగ్గరే డయాగ్నస్టిక్ టెస్టులు‌..

Amazon Diagnostic Tests:  కొత్త సర్వీస్ ప్రారంభించిన అమెజాన్ .. ఇకపై ఇంటి దగ్గరే డయాగ్నస్టిక్ టెస్టులు‌..
X
హైదరాబాద్‌తో పాటూ మరో ఐదు నగరాల్లో కూడా..

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త సర్వీస్ తీసుకొచ్చింది. ఇకపై ఇంటి వద్దే డయాగ్నస్టిక్ టెస్టులు చేయించుకోవచ్చు. ఇంటి వద్దే ల్యాబ్ టెస్ట్ బుకింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. వినియోగదారులు అమెజాన్ యాప్ ద్వారా పరీక్షలను బుక్ చేసుకోవచ్చు. అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయవచ్చు. డిజిటల్ నివేదికలను యాక్సెస్ చేయవచ్చు.

అమెజాన్ డయాగ్నోస్టిక్స్‌ను ప్రారంభించినట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. అమెజాన్ యాప్ ద్వారా కస్టమర్లు ఇంటి వద్దే ల్యాబ్ పరీక్షలు బుక్ చేసుకోవడానికి, అపాయింట్‌మెంట్లను షెడ్యూల్ చేయడానికి, ట్రాక్ చేయడానికి, డిజిటల్ రిపోర్ట్‌లను యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుందని వెల్లడించింది. అమెజాన్ డయాగ్నోస్టిక్స్ లో 800కి పైగా పరీక్షలు అందిస్తోంది. మీ ఇంటికే వచ్చి నమూనాలు సేకరిస్తారు. అమెజాన్ ఫార్మసీతో కస్టమర్లు విస్తృత శ్రేణి ప్రిస్క్రిప్షన్ మందులు, ఆరోగ్య సంరక్షణ అవసరాలను పొందుతారు. ప్రైమ్ నాన్-ప్రైమ్ సభ్యులు ఉచిత టెలిమెడిసిన్ కన్సల్టేషన్ సర్వీస్, డెలివరీ ప్రయోజనాలు పొందుతారు.

అమెజాన్ తన వైద్య సేవలను విస్తరించింది. ఆన్‌లైన్ ఫార్మసీ, టెలి కన్సల్టేషన్లకు మించి సర్వీసులు అందిస్తోంది. ఇండియా కస్టమర్లు ఇకపై అమెజాన్ యాప్‌లో డయాగ్నస్టిక్ పరీక్షలను కూడా బుక్ చేసుకోవచ్చు. భారత్ లో తన ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడంపై అమెజాన్ ఫోకస్ చేసింది. “గ్రాసరీ తర్వాత ఆరోగ్య సంరక్షణ అనేది రోజువారీ అవసరం. మేము ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. కానీ ఇది భారత్ లో అమెజాన్ అందించే వాటిలో చాలా పెద్దది కావొచ్చు” అని అమెజాన్ మెడికల్ కేటగిరీ లీడర్ జయరామకృష్ణన్ బాలసుబ్రమణియన్ అన్నారు.

ఈ సేవను అందించడానికి అమెజాన్ డయాగ్నస్టిక్స్ ల్యాబ్ ఆరెంజ్ హెల్త్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముందుగా కొన్ని నగరాల్లో ఈ సేవను ప్రారంభించనుంది. బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ముంబై, హైదరాబాద్‌లో స్టార్ట్ చేయనుంది. ఆ తర్వాత క్రమంగా ఇతర ప్రాంతాలకు ఈ సేవను విస్తరించనున్నారు. అమెజాన్ తన ఆరోగ్య సంరక్షణ సేవల ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసుకోవడానికి తన ప్రస్తుత కస్టమర్ బేస్‌ను ఉపయోగించుకోవాలని కోరుకుంటోంది. అమెజాన్ మెడికల్ సేవలు ఎక్కువ మంది కస్టమర్లకు చేరువయ్యేలా కృషి చేస్తోంది. భారత్ లో తన కార్యకలాపాలను మెరుగుపరచడానికి 233 మిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ గత వారం ప్రకటించింది.

రెండేళ్ల క్రితం అమెజాన్ తన ఆన్‌లైన్ ఫార్మసీని ప్రారంభించింది. 6 నెలల క్రితం టెలీకన్సల్టేషన్ సేవలను ప్రారంభించింది. ఇప్పుడు డయాగ్నస్టిక్స్‌ను జోడించింది. భారత్ లో ఆరోగ్య సంరక్షణను “దీర్ఘకాలిక అవకాశం”గా అమెజాన్ చూస్తోంది. డయాగ్నస్టిక్స్ రంగంలోకి ఎంటర్ అయిన డిజిటల్ ప్లేయర్ అమెజాన్ మాత్రమే కాదు. ఇప్పటికే టాటా 1ఎంజీ, అపోలో 24/7, ఫార్మసీ, నెట్‌మెడ్స్ వంటి ఆన్‌లైన్ ఫార్మసీలు డయాగ్నస్టిక్స్‌ సేవలను విస్తరించాయి. మన దేశంలో డయాగ్నస్టిక్స్ కు పెద్ద మార్కెట్ ఉంది. ఇందులో అధిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ. దీంతో డయాగ్నస్టిక్స్ సేవలపై పలు పెద్ద కంపెనీలు దృష్టి పెడుతున్నాయి.

”B2C హెల్త్‌టెక్ రంగంలో మూడు ప్రాథమిక ఆదాయ మార్గాలు ఉన్నాయి. టెలికన్సల్టేషన్, డయాగ్నస్టిక్స్, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూషన్. వీటిలో, డయాగ్నస్టిక్స్ అత్యంత ముఖ్యమైన లాభాల సమూహంగా ఉంది” అని 360 ONE అసెట్ సీనియర్ ఫండ్ మేనేజర్, హెల్త్‌కేర్ కన్స్యూమర్ స్ట్రాటజీ హెడ్ తరుణ్ శర్మ అన్నారు.

FY24లో అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ రూ.25,406 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం కంటే 14% ఎక్కువ. మెరుగైన కార్యాచరణ సామర్థ్యాల కారణంగా నికర నష్టం 29% తగ్గి రూ.3,470 కోట్లకు చేరుకుంది.

Tags

Next Story