Ambani Family: 50 జంటలకు పెళ్లిళ్లు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష..
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహానికి ముహూర్తం దగ్గరపడుతోంది. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించిన అంబానీ కుటుంబం.. మరోసారి ముందస్తు పెళ్లి వేడుకలు చేపడుతోంది. ఈ వేడుకల్లో భాగంగా పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు మంగళవారం జూన్ 2వ తేదీన సామూహిక వివాహాలు జరిపించింది. ముంబై సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ వేదికగా ఈ పెళ్లిళ్లు జరిగాయి. ఈ వివాహాలకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, శ్లోక అంబానీ, ఈశా అంబానీ హాజరయ్యారు. కొత్త జంటల తరపున కొంత మంది బంధువులు ఈ పెళ్లిళ్లకు హాజరయ్యారు.
సామూహిక వివాహాలు జరిపించడమే కాదు పుట్టింటి బాధ్యతలను తీసుకుని పెళ్లి కూతుర్లకు సారె పంపించింది అంబానీ కుటుంబం. బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కు పుడకలు, మట్టెలు, పట్టీలు వంటివి అందించింది. అలాగే పెళ్లి కూతురికి స్త్రీ ధనం కింద రూ.1.01 లక్షల చెక్ అందించింది. వీటితో పాటు ఆ జంటలకు ఏడాదికి సరిపడా నిత్యావసర సరుకులు సైతం అందించడం గమనార్హం. పుట్టింటి వారు తన కూతురికి పెళ్లి సారె అందించినట్లుగానే గ్యాస్ స్టవ్, మిక్సీ, పరుపులు, దిండ్లు, ఫ్యాన్, వంట సామగ్రి వంటివి అందించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ పెళ్లిళ్లకు హాజరైన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేసింది అంబానీ కుటుంబం. ఈ సందర్భంగా నూతన వధూవరులు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే రాధికతో అనంత్ అంబానీ వివాహం జులై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com