వారిపై జీవితకాల నిషేధంపై అభిప్రాయాన్ని చెప్పండి : కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించడంపై కేంద్రప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఈడీ సహా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల విచారణ వివరాలపై నివేదికలివ్వడానికి రెండుసార్లు సమయమిచ్చినా నివేదిక అందించకపోవడాన్ని ఆక్షేపించింది. ప్రజాప్రతినిధులపై సుదీర్ఘకాలంగా కేసులు పెండింగ్‌లో ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. నేరచరితులైన ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల విచారణ స్థితిపై నివేదిక సమర్పించాలని గతంలోనే ఆదేశించినా కేంద్రం ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఈ వివరాలతో కౌంటర్ దాఖలు చేయలేరా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగింది. దీనిపై తర్వాత విచారణలోగా నివేదిక అందిస్తామని సొలిసిటర్ జనరల్ తెలిపారు. తాను ఇతర కేసుల్లో వాదనలు వినిపించాల్సి ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కోరారు. అయితే అందుకు ధర్మాసనం నిరాకరించింది. కేంద్రానికి సంబంధం లేని అంశాలపై విచారణ జరుపుతామంటూ విచారణ సాగించింది.
అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా వాదనలు వినిపించారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు.. ఆ తర్వాత మాజీలు.. అందులోనూ మరణ శిక్షలు, యావజ్జీవ శిక్షలు, తర్వాత ఏడేళ్ల వరకు జైలు శిక్షలు పడే అవకాశమున్న తీవ్ర నేరాలు.. ఇలా ప్రాధాన్య క్రమంలో విచారించాలని సిఫారసు చేశారు. ఇలా ఎందుకని జస్టిస్ రమణ ప్రశ్నించగా.. వాళ్లు ప్రజాప్రతినిధులని, కొందరు మంత్రులుగానూ ఉన్నారని, కాబట్టి ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని అమికస్ క్యూరీ వివరించారు. ప్రతి ప్రత్యేక కోర్టులో వాదించడానికి ప్రభుత్వాలు ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తాయని.. కొన్ని రాష్ట్రాల్లో పీపీల నియామకానికి ప్రత్యేక కేడర్ ఉందని, మరికొన్ని రాష్ట్రాల్లో రాజకీయ ప్రాతిపదికన నియమిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టుల ద్వారా పీపీలను నియమించాలని ప్రతిపాదించారు.
ఇదిలా ఉంటే కేసుల విచారణలో సాక్షులకు రక్షణ చాలా ముఖ్యమైన అంశమని, ఇవి ప్రజాప్రతినిధుల కేసులు కాబట్టి సాక్షులకు రక్షణ కల్పించాలా లేదా అన్నది ట్రయల్ కోర్టులు నిర్ణయించేలా ఆదేశాలను జారీ చేయాలని హన్సారియా అభ్యర్థించారు. అయితే వేల మంది సాక్షులకు భద్రత కల్పించడం సాధ్యమేనా అని జస్టిస్ రమణ ప్రశ్నించారు. ఈ అంశాలన్నిటిపై ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ రమణ తెలిపారు.
అలాగే పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణన్ వాదనలు వినిపిస్తూ.. శిక్షపడిన ప్రజాప్రతినిధులు ఆరేళ్లు పోటీచేయకుండా ప్రస్తుతం నిషేధం ఉందని.. దానిని జీవితకాలానికి మార్చాలని అభ్యర్థించారు. జీవితకాల నిషేధాన్ని సమర్థిస్తూ 2017లోనే కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసిందని మరో న్యాయవాది గుర్తు చేశారు. దాంతో కేంద్రం వైఖరి ఏమిటో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com