Chandrayaan-3: ఇప్పటివరకూ చూడని జాబిల్లి చిత్రాలు

జాబిల్లి(Moon)పై అడుగుపెట్టే దిశగా చంద్రయాన్-3 దూసుకెళ్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువం (Lunar South Pole)పై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) అన్వేషణ సాగిస్తోంది. ఈ క్రమంలోనే భూమికి ఎప్పుడూ కన్పించని జాబిల్లి దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతం చిత్రాలను విక్రమ్ ల్యాండర్ తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ISRO) ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా (LHDAC) భూమికి కన్పించని జాబిల్లి దక్షిణ ధ్రువం చిత్రాలను తీసిందని ఇస్రో వెల్లడించింది.

చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ సురక్షితంగా ల్యాండ్ అయ్యే ప్రాంతాన్ని గుర్తించేందుకు ఈ కెమెరా సాయపడనుంది. బండరాళ్లు, లోతైన కందకాలు లేని ప్రదేశం కోసం ల్యాండర్ అన్వేషిస్తోందని ఇస్రో తెలిపింది. ఆగస్టు 19న ల్యాండర్ ఈ ఫొటోలు తీసినట్లు ఇస్రో వెల్లడించింది. తాజా ఫొటోల్లోనూ జాబిల్లి ఉపరితలంపై అనేక బిలాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వాటి పేర్లను ఇస్రో తాము విడుదల చేసిన ఫొటోల్లో పేర్కొంది. సాధారణంగా మనకు ఎప్పుడూ చంద్రుడి ఒకవైపే కన్పిస్తుంది. అవతలి వైపు కనిపించదు. చంద్రుడు తన కక్ష్య మీద ఒకసారి పూర్తిగా భ్రమించటానికి పట్టే సమయం, భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయం సమానంగా ఉంటుంది. దీన్ని టైడల్ లాకింగ్ అంటారు. దీని మూలంగానే చంద్రుడి ఒక వైపే మనకు కనిపిస్తుంది.

ఇప్పుడు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan-3).. జాబిల్లి పైకి ఎవరూ వెళ్లని మార్గంలో దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆ ధ్రువం దిశగా పయనిస్తోన్న ల్యాండర్ విక్రమ్.. జాబిల్లి అవతలివైపు దృశ్యాలను తీసింది. ప్రస్తుతం ల్యాండర్ జాబిల్లి చుట్టూ ఉన్న 25×134 కి.మీల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇది విజయవంతమైతే.. జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన సోవియట్ యూనియన్, అమెరికా, చైనా జాబితాలో భారత్ కూడా చేరనుంది.

మరోవైపు ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడిపై రష్యా (Russia) చేపట్టిన ప్రయోగం విఫలమైంది. జాబిల్లిపై పరిశోధనల్లో రష్యాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టాలన్న తొలి దేశంగా దిగాలన్న రష్యా ఆశలు.. అడియాసలు అయ్యాయి. చందమామ దక్షిణ ధ్రువంపై దిగడానికి రష్యా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టడానికి ముందే కుప్పకూలింది. ల్యాండింగ్ కు ముందు ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్ కు చేరడానికి శనివారం లూనా-25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. ఫలితంగా నిర్దేశిత పరామితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్ కాస్మోస్ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com