Maharashtra | డిప్యూటీపై షిండే విముఖత?.. షిండే వర్గం సంచలన నిర్ణయం!

Maharashtra | డిప్యూటీపై షిండే విముఖత?..  షిండే వర్గం సంచలన నిర్ణయం!
X
కూటమి కీలక సమావేశం రద్దు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్‌ ఇంకా వీడలేదు. ఒక పక్క బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే కాబోయే సీఎం అని అనధికార ప్రచారం జరిగినా దానిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించ లేదు. ఈ పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్న శివసేనకు చెందిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. అధిష్ఠానం నిర్ణయానికి ఆయన ఎంతమాత్రం సంతోషంగా లేరని, దానికి నిరసనగానే హఠాత్తుగా ఆయన తన సొంత గ్రామం సతారకు వెళ్లిపోయారని, ఆయన గైర్హాజరీతో శుక్రవారం జరగాల్సిన రెండు కూటమి సమావేశాలు రద్దయ్యాయని కొందరు శివసేన నేతలు తెలిపారు.

బీజేపీ ఫార్ములా నచ్చకే…

గురువారం అమిత్‌ షా నివాసం (ఢిల్లీ)లో జరిగిన కీలక సమావేశానికి ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేబినెట్‌లో పదవుల పంపకానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత ఏక్‌నాథ్‌ షిండే.. షాతో అంతర్గత చర్చలు జరిపారు. షిండేకు డిప్యూటీ సీఎం పదవి లేదా కేంద్రంలో మంత్రి పదవిని ఆఫర్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. షిండే కేంద్ర మంత్రి పదవిని అంగీకరిస్తే, మరో శివసేన నేతకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలనుకున్నారు.

నిర్ణయం మార్చుకున్న షిండే…

అమిత్‌ షాతో సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత షిండే తన నిర్ణయాన్ని మార్చుకున్నారని, అధిష్ఠానం ప్రతిపాదించిన కూటమి ఫార్ములా ఆయనకు నచ్చలేదని ప్రచారం జరుగుతున్నది. ముందుగా ఎలాంటి షెడ్యూల్‌ లేకుండా ఆయన సొంత గ్రామానికి వెళ్లడం పలు అనుమానాలకు దారి తీసింది.

అలాంటిదేం లేదు.. ఫడ్నవీసే సీఎం

షిండే అసంతృప్తిగా ఉన్నారని జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేస్తూ నిర్ణయం జరిగిపోయిందని, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా షిండే, అజిత్‌ ఉంటారని ఆ పార్టీ తెలిపింది. కాగా, బీజేపీ శాసనసభా పక్ష సమావేశం డిసెంబర్‌ 1న జరగనుంది. దేవేంద్ర ఫడ్నవీస్‌ను కాకుండా, వేరే కొత్త మరాఠా ముఖాన్ని సీఎం పోస్టుకు పరిగణనలోకి తీసుకోవచ్చునని అంటున్నారు.

Tags

Next Story