NEET: నీట్‌పై నేడు ఉన్నత స్థాయి కమిటీ తొలి భేటీ

ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీ

నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ సోమవారం తొలిసారి సమావేశం అవుతున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీక్‌పై వివాదం రోజురోజుకు ముదురుతోంది. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయసభలను ప్రతిపక్షాలు స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై కమిటీని నియమించింది. నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా విద్యాశాఖకు నివేదిక అందజేయాలని కేంద్రం ఆదేశించింది.

నీట్, యూజీసీ నెట్ పరీక్షల అవకతవకల ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. మొత్తంగా ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్‌ నేతృత్వం వహించనున్నారు. ఎయిమ్స్‌ ఢిల్లీ మాజీ డైరెక్టర్‌ డా.రణ్‌దీప్‌ గులేరియా, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బి.జె.రావు, ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ కె.రామమూర్తి, కర్మయోగి భారత్‌ సహ వ్యవస్థాపకుడు పంకజ్‌ బన్సల్‌, ఐఐటీ దిల్లీ డీన్‌ (విద్యార్థి వ్యవహారాలు) ప్రొఫెసర్‌ ఆదిత్య మిత్తల్‌, కేంద్ర విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

నీట్‌-యూజీకి రెండోసారి హాజరైంది 52 శాతమే

గ్రేస్‌ మార్కులు తొలగించిన 1,563 విద్యార్థులకు ఆదివారం నీట్‌-యూజీ పరీక్షను ఎన్‌టీఏ మరోసారి నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 1,563 మందికిగానూ 813 మంది, అంటే 52 శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరైనట్టు ఎన్‌టీఏ సీనియర్‌ అధికారి వెల్లడించారు. మే 5న జరిగిన నీట్‌-యూజీ పరీక్షలో సమయాన్ని కోల్పోయిన 1,563 మంది విద్యార్థులకు మొదట ఎన్‌టీఏ గ్రేస్‌ మార్కులను కలిపిన సంగతి తెలిసిందే. ఇది వివాదాస్పదం కావడంతో గ్రేస్‌ మార్కులు తొలగించి, వీరికి మళ్లీ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు హాజరైన వారికి ఇందులో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని, హాజరుకాని వారికి గత పరీక్ష మార్కులను(గ్రేస్‌ మార్కులు మినహాయించిన తర్వాత) పరిగణిస్తామని గతంలోనే ఎన్‌టీఏ స్పష్టత ఇచ్చింది.

Tags

Next Story