మణిపూర్‌లో శాంతి స్థాపనే లక్ష్యంగా ఆల్ పార్టీ మీట్

ప్రశాంతతకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. నెలన్నరగా జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తెచ్చి మణిపూర్‌లో శాంతిని స్థాపించడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఖిల పక్ష భేటీకి పిలుపునిచ్చారు. జూన్ 24న ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ అఖిల పక్ష సమావేశం జరగనుంది. మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగిన తర్వాత ఇదే తొలి అఖిలపక్ష సమావేశం కావడం గమనార్హం. సీఎం బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మణిపూర్ ప్రజలు పూర్తి విశ్వాసం కోల్పోయారని భాజపాకు చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనాలంటే మొదట ప్రభుత్వం చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని, పరిపాలనా విధానంలో మార్పులు చేయాలని వారు లేఖలో కోరారు. ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మెయిటీ తెగకు చెందినవారే. ఈ లేఖ నేపథ్యంలో అమిత్ షా అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. మే 3న మణిపూర్ ఒక్కసారిగా భగ్గుమంది. ఇక్కడి జనాభాలో అత్యధికులు మెయిటీ, కుకీ తేగల మధ్య వైరం తారాస్థాయిలో రాజుకుంది. రెండు వర్గాలు పరస్పర దాడులు చేసుకుంటూ సృష్టించిన బీభత్సంలో అనేకమంది సామాన్యుల జీవితాలు చితికిపోయాయి. ఈ అల్లర్ల కారణంగా 100 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com