Amit Shah : త్రివేణీ సంగమంలో అమిత్ షా పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించి మహాకుంభ్ ఏర్పాట్లపై సమీక్షించారు. మరోవైపు షా పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు.
ఈ మహాకుంభమేళాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం మహాకుంభ్‌ను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రపతి ముర్ము మహాకుంభమేళాకు వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ సైతం ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు.
సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే 14 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com