డిసెంబర్‌ 9న కేంద్రంతో మరో విడత రైతుల చర్చలు

డిసెంబర్‌ 9న కేంద్రంతో మరో విడత రైతుల చర్చలు

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఢిల్లీ వేదికగా రైతుల పోరాటం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో... ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 9న కేంద్రంతో మరో విడత చర్చలు జరగనున్నాయి.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో శనివారం కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాలేదు. రైతులతో సమావేశమైన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్.. మధ్యలోనే వెళ్లిపోయారు. రైతులతో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. రైతులకు మేలు చేసేందుకే చట్టాన్ని తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. అటు... రైతుల ఆందోళనపై ప్రధాని నరేంద్ర మోదీ... కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌తో సుదీర్ఘంగా చర్చించారు. అన్నదాతల ప్రతిపాదనల మేరకు వ్యవసాయ చట్టాల్లో కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించారు.

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నేతృత్వంలో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటారో... లేదో చెప్పాలని రైతులు తోమర్‌ను ప్రశ్నించారు. అయితే.. చట్టాల్ని రద్దుచేసే పరిస్థితి లేదని..., మిగిలిన ఎనిమిది అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. మరిన్ని ప్రతిపాదనల కోసం సమయం కావాలని కోరారు. ఈ నెల 9న మరోసారి చర్చలకు రావాలని రైతు సంఘాల్ని కేంద్రం ఆహ్వానించింది.

కనీస మద్దతు ధర విషయంలోనూ తాము హామీ ఇవ్వడానికి సిద్ధమేనని నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. చర్చల్లో భాగంగా పంటల మద్దతు ధరకు హామీ, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించి సమస్యలు వస్తే... సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ మండీలలో రిజిస్టర్‌ అయిన సంస్థలే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తామని, సవరణల కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని చెప్పారు. న్యాయ శాఖతోనూ చర్చలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

రైతులు పండించే పంటల్ని మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసేవారిని అరెస్ట్‌ చేసి... ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అన్నదాతల్ని మోసం చేసిన దళారీలపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కేంద్రంతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో పది రోజులుగా రైతులు పోరాటం కొనసాగుతోంది. చలిని సైతం లెక్క చేయకుండా అలుపెరుగని ఉద్యమం చేస్తున్నారు. శిబిరాలు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story