Jammu Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మళ్లీ అదే రగడ

జమ్మూకశ్మీర్ శాసనసభ మరోసారి రణరంగంగా మారింది. ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దూసుకుపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మార్షల్స్ రంగంలోకి దిగి తన్నుకుంటున్న ఎమ్మెల్యేలను విడదీశారు. ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలని కోరుతూ పీడీపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా ఇవ్వాలని కోరింది. దీనిని బీజేపీ సభ్యులు వ్యతిరేకించడంతో అసెంబ్లీలో ఉద్రికత వాతావరణం నెలకొంది. ప్రత్యేక హోదా తీర్మానంపై నిరసన సందర్భంగా వెల్ లోకి విపక్ష సభ్యులు దూసుకెళ్లారు. స్పీకర్ సభ్యులను అసెంబ్లీ నుంచి తీసుకెళ్లాలని ఆదేశించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ అబ్దుల్ రహీమ్ ఆదేశాల మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలను బయటకు పంపారు. విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ స్పీకర్ సభను వాయిదా వేశారు.
370 తీర్మానంపైనే..
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్టికల్ 370 ఆమోదించిన తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యలు నిరసన వ్యక్తం చేయడంతో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. గురువారం బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సునీల్ శర్మ తీర్మానంపై మాట్లాడుతుండగా.. అవామీ ఇత్తెహాద్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ ఆర్టికల్ 370, 35 (ఏ)లను పునరుద్ధరించాలని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించాడు. దీంతో బీజేపీ సభ్యులు ఆగ్రహంతో వెల్ లోకి దూకి బ్యానర్‌ను లాక్కొని ముక్కలుగా చింపేశారు. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. అయితే సభ వాయిదా పడిన తర్వాత కూడా బీజేపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. సభ ప్రారంభం అయిన తర్వాత కూడా బీజేపీ సభ్యులు నిరసన కొనసాగించారు. స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలు కుర్చీలో కూర్చోవాలని రిక్వెస్ట్ చేసినా వారు వినలేదు. మీరు విపక్ష నేత అని మీరు చెప్పేది వింటామని ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత సునీల్ శర్మతో స్పీకర్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు నిల్చొని నిరసన తెలిపారు. అనంతరం ‘బలిదాన్ హువే జహాన్ ముఖర్జీ వో కశ్మీర్ హమారా హై’ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు ఎన్సీ ఎమ్మెల్యే బదులిస్తూ ‘జిస్ కశ్మీర్ కో ఖూన్ సే సీంచా, వో కశ్మీర్ హమారా హై’ అంటూ నినాదాలు చేశారు.
నేషనల్ కాన్ఫరెన్స్‌పై బీజేపీ ఆగ్రహం
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ముగిసిన చరిత్రగా నిలిచిందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రవీంద్ర రైనా అన్నారు. 370 జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదం, పాకిస్తాన్ భావజాలాన్ని వ్యాప్తిచెందింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ విరుద్ధంగా అసెంబ్లీలో 370 ప్రతిపాదనను తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. చాటుగా తీసుకొచ్చి హడావుడిగా సభలో ప్రదర్శించడం జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని మళ్లీ దిగజార్చాలని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ భావిస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌లు భారత్‌పై కత్తికట్టాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com