Anthony Albanese: ఆస్ట్రేలియాలో లేబర్‌ పార్టీ ఘన విజయం,ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్

Anthony Albanese: ఆస్ట్రేలియాలో లేబర్‌ పార్టీ ఘన విజయం,ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్
X
వరుసగా రెండోసారి అధికారంలోకి

ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోనీ ఆల్బనీస్‌ వరుసగా రెండోసారి విజయం సాధించారు. శనివారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఆల్బనీస్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ గెలుపొందింది. దీంతో 2004 తర్వాత వరుసగా అధికారంలోకి వచ్చిన తొలి ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. మరో మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత పీటర్‌ డట్టన్‌ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. తాము సరిగ్గా రాణించలేదని, ఫలితాల్లో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు.

ప్రతినిధుల సభలోని 150 స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు క్రమంలో అధికార లేబర్‌ పార్టీ ఇప్పటికే 86 స్థానాల్లో విజయం సాధించి.. మెజార్టీ మార్కు (76) దాటేసింది. ద్రవ్యోల్బణం, ఇంధన విధానాలు, ఇళ్ల కొరత, వడ్డీ రేట్లలో పెరుగుదల వంటి సమస్యలే ప్రధాన అంశాలుగా ఎన్నికలు సాగాయి. ఓటింగ్‌ అనంతరం.. ఆల్బనీస్‌ సర్కారే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వెలువడ్డాయి. 2022 నుంచి ప్రధానిగా ఉన్న ఆయన.. మరో మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో.. ఆస్ట్రేలియన్లు ఆశావాదం, దృఢ సంకల్పాన్ని ఎంచుకున్నారని తన విజయ ప్రసంగంలో ఆల్బనీస్‌ తెలిపారు.

ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

వరుసగా రెండోసారి ఎన్నికైన ఆల్బనీస్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అఖండ విజయం సాధించి ఆస్ట్రేలియా ప్రధానిగా మరోసారి ఎన్నికైనందుకు అభినందనలు. ఈ తీర్పు మీ నాయకత్వంపై ఆస్ట్రేలియా ప్రజల విశ్వాసాన్ని సూచిస్తోంది. భారత్‌-ఆస్ట్రేలియాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునేందుకు, ఇండో- పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం కోసం మన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేలా కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Tags

Next Story