NIA: పశ్చిమ బెంగాల్ ఎన్ఐఏ అధికారులపై దాడి

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని భూపతినగర్‌లో ఇవాళ (శనివారం) ఉదయం ఎన్‌ఐఏ బృందంపై దాడి జరిగింది. ఇద్దరు టీఎంసీ నేతలను అరెస్టు చేసేందుకు అధికారుల బృందం భూపతినగర్‌కు వెళ్లింది. అకస్మాత్తుగా 150 మంది గ్రామస్తులు గుమిగూడి నిందితులను తమతో తీసుకెళ్లకుండా NIA బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జనం ఎన్‌ఐఏ వాహనాలపై రాళ్లతో దాడి చేయడంతో ఇద్దరు అధికారులు గాయపడినట్లు తెలుస్తుంది.
అయితే, కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు 2022లో జరిగిన పేలుడు కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. గత నెలలో ఎన్ఐఏ 8 మంది టీఎంసీ నేతలను విచారణకు పిలిచింది. మార్చి 28న న్యూ టౌన్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి అందరినీ రావాలని తెలిపింది. ఇదే కేసులో టీఎంసీ నేత మంబేంద్ర జానాతో పాటు మరొకరిని అరెస్ట్ చేసేందుకు ఎన్ఐఏ బృందం భూపతినగర్ చేరుకుంది. కానీ విచారణ సమయంలో అక్కడ ఉన్న గ్రామస్తుల నుంచి ఎన్ఐఏ నిరసనలను ఎదుర్కోవలసి వచ్చింది. నిందితులను తప్పించేందుకు అక్కడి ప్రజలు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఎన్ఐఏ అధికారుల కార్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కారు విండ్ స్క్రీన్ దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఎన్‌ఐఏ అధికారులు అక్కడికి చేరుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్థానిక పోలీసులకు ఎన్ఐఏ అధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com