Shrikant Purohit : లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌కు బ్రిగేడియర్‌ హోదా..

Shrikant Purohit :  లెఫ్టినెంట్‌  కల్నల్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌కు బ్రిగేడియర్‌ హోదా..
X
ఆమోదం తెలిపిన భారత సైన్యం

లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్ పురోహిత్‌ (Lt Col Shrikant Purohit) కు బ్రిగేడియర్‌ (Brigadier) గా పదోన్నతి కల్పించేందుకు భారత సైన్యం (Indian Army) ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్‌ బాంబు పేలుళ్ల (Malegaon blast) కేసులో శ్రీకాంత్‌ పురోహిత్‌ కూడా అభియోగాలు ఎదుర్కొన్నారు. అయితే ముంబైలోని ప్రత్యేక కోర్టు గత ఏడాది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.

పదోన్నతి పదవీకాల ప్రయోజనాలను కోరుతూ కల్నల్‌ సాయుధ దళాల ట్రిబ్యునల్ (AFT) లో పిటిషన్‌ దాఖలు చేశారు. మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కేసు విచారణ సుదీర్ఘకాలం సాగడంవల్ల తన వృత్తిపరమైన పురోగతిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 31న జరగాల్సిన కల్నల్‌ పదవీ విరమణపై ఏఎఫ్‌టీ స్టే విధించింది. ఈ క్రమంలో రక్షణశాఖకు నోటీసులు జారీచేసింది. కల్నల్‌ చేసిన చట్టబద్ధమైన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకునేంత వరకు అతడి పదవీ విరమణను ఆపేయాలని అందులో పేర్కొన్నది.

ఈ క్రమంలోనే శ్రీకాంత్ పురోహిత్‌కు పదోన్నతి కల్పిస్తూ భారత సైన్యం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని మాలేగావ్‌ ప్రాంతంలో 2008 సెప్టెంబర్‌ 29న పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌ సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదైంది. గత ఏడాది ఈ కేసుపై విచారణ జరిపిన ఎన్‌ఐఏ కోర్టు అభియోగాలు ఎదుర్కొంటున్న అందరినీ నిర్దోషులుగా తేల్చింది.

Tags

Next Story