India-China: లడఖ్‌లో వెనక్కి తగ్గిన భారత్- చైనా సైన్యాలు
లడఖ్‌లో భారత్, చైనా సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు ఇరు దేశాల సైన్యాలు 2020లో ఘర్షణకు ముందు ఉన్న వారి సంప్రదాయ పోస్టుల వద్ద మోహరించి ఉంటాయి. ఇప్పుడు సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్ మాత్రమే ఉంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ చర్య రెండు దేశాల మధ్య శాంతి యుగానికి నాందిగా పరిగణించబడుతుంది. గురువారం దీపావళి సందర్భంగా ఇరు సేనలు పరస్పరం స్వీట్లు పంచుకుంటాయని సైనిక వర్గాలు తెలిపాయి. తూర్పు లడఖ్‌లోని డెప్సాంగ్, డెమ్‌చోక్‌లలో ఇరు దేశాల సైన్యాలు విడిచిపెట్టాయని తెలిపారు.
ఢిల్లీలో చైనా రాయబారి జూ ఫెయింగ్ మాట్లాడుతూ.. రెండు దేశాల అనేక ముఖ్యమైన అవగాహలకు వచ్చాయని వ్యాఖ్యానించారు. ‘రష్యాలోని కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య అతి ముఖ్యమైన భేటీ జరిగింది.. ఇరు దేశాధినేతలు ముఖ్యమైన అవగాహనకు వచ్చాయి.. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మార్గదర్శకాలు త్వరలోనే రూపొందిస్తాం.. ఈ భేటీని స్ఫూర్తిగా తీసుకుని ఎటువంటి అంతరాయం, అభిప్రాయబేధాలు లేకుండా ఇరు దేశాల సంబంధాలు మరింత ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాం’ అని ఆయన అన్నారు.
‘ఇరుగుపొరుగు దేశాల మధ్య కొన్ని సమస్యలు ఉండటం సహజం.. వీటిని పరిష్కరించుకోవడమే అతిముఖ్యమైన అంశం.. వీటిని ఎలా పరిష్కరించుకోవాలో ఇరు దేశాధినేతల సమావేశం చక్కని ఉదాహరణ’ అని తెలిపారు. కాగా, దెప్సాంగ్, దేమ్‌చుక్ ప్రాంతాల నుంచి సైనికుల తరలింపునకు ఒప్పందం కుదిరినట్టు అక్టోబరు 21న భారత్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య 2020 మే నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తెరదించుతూ భారత్, చైనాలు ఒప్పందానికి రావడం శుభపరిణామం. భారత్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైనట్టు ఉపగ్రహా ఫోటోలు వెల్లడించాయి. కాగా, జిన్‌పింగ్, మోదీ భేటీకి రెండు రోజుల ముందే భారత్, చైనాలు సైన్యాల ఉప-సంహరణపై అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఆ తర్వాత రష్యాలో ఇరువురూ భేటీ అయి.. ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు వివాదాలపై చర్చించారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయానికి వచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com