Digital Arrest : వీడియో కాల్స్‌ ద్వారా అరెస్టులు జరగవు

Digital Arrest : వీడియో కాల్స్‌ ద్వారా అరెస్టులు జరగవు
X
సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌

దేశంలో ‘డిజిటల్‌ అరెస్టు’లకు సంబంధించిన నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) శనివారం ఓ అడ్వైజరీని జారీ చేసింది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కస్టమ్స్‌, పోలీస్‌ అధికారులు లేదా జడ్జీలు వీడియో కాల్స్‌ ద్వారా ఎవరినీ అరెస్టు చేయరని ఆ అడ్వైజరీలో స్పష్టం చేసింది. డిజిటల్‌ అరెస్టులను కుంభకోణం (స్కామ్‌)గా పేర్కొన్నది. ఇంటర్నెట్‌తోపాటు వాట్సాప్‌, స్కైప్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికలు, వాటి లోగోలను ఉపయోగించడం ద్వారా జరిగే ఇలాంటి నేరాల బారిన పడొద్దని ప్రజలకు సూచించింది. డిజిటల్‌ అరెస్టులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

అసలు డిజిటల్ అరెస్ట్ ఎలా చేస్తారు?

డిజిటల్ అరెస్ట్‌లో సైబర్ నేరస్థులు మిమ్మల్ని CBI లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ సంస్థ అధికారులుగా నటిస్తూ కాల్ చేస్తారు. మీరు కొన్ని చట్టపరమైన ఇబ్బందుల్లో ఉన్నారని, మిమ్మల్ని అరెస్టు చేయవచ్చని వారు భయపెడతారు. ఇది ఒక రకమైన సైబర్ మోసం. దీనిలో సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరించి వారి నుండి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పేరు మీద ఒక పార్శిల్ వచ్చిందని, అందులో నిషేధిత వస్తువులు ఉన్నాయని కూడా చెబుతుంటారు. అంతేకాదు కొంత మొత్తాన్ని ఇవ్వాలని, లేకుంటే మీపై కేసు నమోదు చేస్తామని భయపెడుతుంటారు. ఇలాంటి కాల్స్‌ వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి కాల్స్‌ వస్తే ఇలా చేయండి:

మీకు అలాంటి కాల్ వస్తే, వెంటనే దాన్ని డిస్‌కనెక్ట్ చేయండి. కాల్‌లో మీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని లేదా ఏదైనా సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయవద్దు. మీ కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడు ఏదైనా కేసులో పట్టుబడ్డారని సైబర్ నేరస్థుడు ఫోన్‌లో చెబితే , ముందుగా మీ కుటుంబ సభ్యుడు, స్నేహితుడితో మాట్లాడి పరిస్థితి గురించి సమాచారాన్ని పొందండి.

మీకు సైబర్ మోసం జరిగినట్లు అనిపిస్తే, లేదా ఇలాంటివి జరగబోతుంటే, పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయండి. మీరు సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కూడా కాల్ చేయవచ్చు. ఇది కాకుండా, మీరు సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఆన్‌లైన్ ఫిర్యాదును ఫైల్ చేయవచ్చు .

Tags

Next Story