J&K: ఏ క్షణమైనా ఎన్నికలకు రెడీ

J&K:  ఏ క్షణమైనా ఎన్నికలకు రెడీ
ఆర్టికల్ 370 పిటిషన్ విచారణ సందర్బంగా సుప్రీంకు తెలిపిన కేంద్రం

జమ్మూ కశ్మీర్లో ఏ క్షణమైనా ఎన్నికలు జరిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. కొంతకాలం క్రితం జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్ , సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370 పిటిషన్ ను విచారిస్తోంది.

ఈ నేపథ్యంలో జమ్మూలో ఎన్నికల ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఒక కాలపరిమితిని పేర్కొనాల్సిందిగా మంగళవారం మొదటిసారి కేంద్రాన్ని కోరింది. దీనికి స్పందించిన కేంద్రం జమ్మూకశ్మీర్‌లో ఏ క్షణాన అయినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు గురువారం తెలిపింది. అయితే ఈ నిర్ణయం ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానిదే అని ప్రభుత్వం తెలిపింది.


5 ఆగస్టు 2019లో కేంద్రం రద్దు చేసిన ఈ అధికరణతో జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి హోదాను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్రం చెప్పింది. అయితే జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని ఇతర రాష్ట్రాలతో పోల్చలేమని, విభజన అవసరమని గతంలో కేంద్రం వాదించింది. మంగళవారం జరిగిన విచారణలో, జూన్ 2018 నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఎన్నుకోబడిన ప్రభుత్వం లేకుండా ఉందని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఇదిలా ఉంటే రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించి నిర్ధిష్ట గడవు ఇవ్వలేమని కేంద్రం, సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇక ఈ రోజు జరిగిన విచారణలో 2018 నుంచి 2023తో పోలిస్తే ఉగ్రవాద కేసులు, చొరబాట్లు 90 శాతం తగ్గాయని కేంద్రం, సుప్రీం కోర్టుకు తెలియజేసింది. రాళ్ల దాడులు, లా అండ్ ఆర్డర్ సమస్యలు 97 శాతం తగ్గాయని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు తెలియజేశారు. భద్రత సిబ్బంది ప్రమాదాలు 65 శాతం తగ్గాయని, 2018లో రాళ్ల దాడులకు సంబంధించిన కేసులు 1767 నమోదైతే ఇప్పుడు అసలు లేవని, అలాగే 2018లో 52 సార్లు బందులు జరుగగా ఇప్పుడు అవి కూడా లేవని తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story