Amit Shah on Article 370: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదం పెరగడానికి కారణం ఆర్టికల్ 370

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వాగతించారు. ఈ తీర్పు తర్వాత... జమ్ముకశ్మీర్ రాజ్యాంగానికి ఇకపై ఎలాంటి విలువ ఉండదన్నారు. ఆర్టికల్ 370 వేర్పాటువాదం ఉగ్రవాదానికి దారితీసిందని హింస లేని, కొత్త, అభివృద్ధి చెందిన కశ్మీర్ ప్రధాని మోదీ హయాంలో నిర్మితమవుతోందని అమిత్ షా రాజ్యసభలో చెప్పారు.సరైన సమయంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో జరిగిన మార్పులను ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయని..... షా విమర్శించారు. రాజ్యసభ వేదికగా భారత మాజీ ప్రధాని నెహ్రూపై.. అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఒకే వ్యక్తి వల్ల భారత్‌లో జమ్ముకశ్మీర్ భాగం కావడం ఆలస్యమైందనిఆరోపించారు.
కశ్మీర్‌లో కాల్పుల విరమణ లేకపోయి ఉంటే అసలు POK ఉండేది కాదని అమిత్ షా చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో భాగమేనన్న షా అంగుళం భూభాగాన్ని కూడా కోల్పోయే ప్రసక్తే లేదన్నారు. వేర్పాటువాదాన్ని ప్రోత్సహించిన నాయకులను కశ్మీర్ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నవారిని గుర్తించి, ఆ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నించామన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారీ స్థాయిలో దాడులు ఎప్పుడైనా జరిగాయా? పెద్ద సంఖ్యలో ఎవరైనా మరణించారా? అని అమిత్ షా ప్రశ్నించారు. కొత్త బిల్లుల వల్ల POK నుంచి.. 24 మందికి సీట్ల రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. ఉరీ, పుల్వామా సెక్టార్లలో మారణహోమం సృష్టించిన వారిని, వాళ్ల ఇంటికి వెళ్లి మరీ హతమార్చామంటూ పాక్ భూతలంలో సర్జికల్ స్ట్రైక్స్ విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు భారత్‌లో.... ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే ప్రధాని ఉన్నారని ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com