Arvind Kejriwal: తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం
మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దొరికింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయ్యారు.
మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. 10 రోజుల విచారణ అనంతరం ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం మే 10న 21 రోజుల పాటు విడుదలయ్యారు. మరో 51 రోజుల పాటు తర్వాత జైలులో ఇప్పుడే విడుదలయ్యారు. కేజ్రీవాల్ నేటికీ 177 రోజులు జైలులో గడిపారు. ఎన్నికల సందర్భంగా 21 రోజులను తగ్గిస్తే.. కేజ్రీవాల్ మొత్తం 156 రోజులు జైలులోనే ఉన్నారు.
జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. “మొదట నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన కారణంగా నేను బయటకు వచ్చాను. దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలలో ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. నా ప్రతి రక్తపు బొట్టు దేశానికే అంకితం.” అని చెప్పారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని .. వారి జైలు నా ధైర్యాన్ని విచ్ఛిన్నం చేయలేకపోయిందని తెలిపారు.
కాగా.. సీఎంకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. అయితే, న్యాయప్రక్రియలో సుదీర్ఘ కారాగారవాసం అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడమేనని బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ అన్నారు. ‘‘అరెస్టు చేసిన సమయంలో అనేక ప్రశ్నలు, సందేహాలను లేవనెత్తుతోంది. బెయిల్ పొందిన కేజ్రీవాల్‌ను నిరాశపర్చడం కోసమే అరెస్టు చేసినట్టుగా అనిపించింది.” అని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేసిన తర్వాత 22 నెలలు మౌనంగా ఉన్న సీబీఐ..ఈడీ కేసులో ఆయనకు బెయిలొస్తున్న తరుణంలో క్రియాశీలకంగా మారడాన్ని జస్టిస్ భుయాన్ తన తీర్పులో తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ఏమాత్రం సమర్థించుకొనేలా లేదని అన్నారు. ‘‘17.08.22న సీబీఐ కేసు నమోదు చేసింది. 21.03.24న ఈడీ అరెస్టు చేసింది. అప్పటివరకు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని సీబీఐ భావించలేదు. 16.04.23న ఇంటరాగేషన్ కూడా చేసింది. ఈడీ కేసులో 20.06.24న స్పెషల్ జడ్జి సాధారణ బెయిల్ మంజూరు చేయగానే ఒక్కసారిగా సీబీఐ క్రియాశీలకంగా మారింది. 26.06.24న కస్టడీని కోరింది. సీబీఐ ఆలస్యంగా అరెస్టు చేయడం సమర్థించుకొనేలా లేదు. ఆ అరెస్టు తర్వాత ఆయన్ను సుదీర్ఘంగా జైలులో ఉంచడం ఇంకా అసమంజసంగా ఉందని నేను భావిస్తున్నాను’’ అని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com