Arvind Kejriwal: జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారిన కేజ్రీవాల్..

Arvind Kejriwal (tv5news.in)

Arvind Kejriwal (tv5news.in)

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్.. సినిమాటిక్‌గా చెప్పాలంటే ఇపుడది పేరు కాదు.. ఇట్స్‌ ఏ బ్రాండ్.

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్.. దేశం మొత్తం మార్మోగుతున్న పేరు. సినిమాటిక్‌గా చెప్పాలంటే ఇపుడది పేరు కాదు.. ఇట్స్‌ ఏ బ్రాండ్. అతను కోట్లాది అభిమానులున్న హీరో కాదు. రాజకీయ వారసుడు అంతకన్నా కాదు. అతనో సామాన్యుడు. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి అవినీతికి వ్యతిరేకంగా పోరుబాటపట్టారు. అన్నా బృందంతో పనిచేసి ఆనక రాజకీయాల్లోకి వచ్చారు.

సామాన్యుల కోసం 2012 న‌వంబ‌ర్ 26న ఢిల్లీ కేంద్రంగా ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి రాజకీయ నాయకుడిగా మారారు. ప్రజాభిమానంతో నేడు అసమాన్యుడిగా, ప్రజాదరణ గల నేతగా దేశం మొత్తం మాట్లాడుకునేలా చేశారు. స‌మ‌కాలీన భార‌త రాజ‌కీయాల్లో ఆమ్ఆద్మీ పార్టీది విశిష్ట‌మైన స్థానం. సామాన్యుల పార్టీగా ఒక సామాన్యుడు స్థాపించిన పార్టీ ఇది.

ఇక అతికొద్ది కాలంలోనే ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ పార్టీల‌కు స‌వాల్ విసిరే స్థాయికి సాగించిన విజ‌య ప్ర‌స్థానం నిజంగా అద్భుత‌మే. పార్టీ స్థాపించిన ఏడాదికే 2013లో మొద‌టిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేసి 28సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బీజేపీ తరువాత రెండో పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీతో క‌లిసి సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్.. తొలిసారి ముఖ్య‌మంత్రి అయ్యారు.

అయితే జ‌న్‌లోక్‌పాల్ బిల్లును లోక్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నందుకు నిర‌స‌న‌గా 49 రోజుల‌కే ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి ప్ర‌భుత్వం ర‌ద్దుకు సిఫార్సు చేస్తూ సంచల నిర్ణయం తీసుకున్నారు కేజ్రీవాల్‌. తర్వాత 2015లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల‌కు గాను ఏకంగా 67 స్థానాల‌ు ఖాతాలో వేసుకుని ఆప్‌కు క‌ళ్లు చెదిరే విజ‌యం అందించారు.

కేజ్రీవాల్ను ఎదుర్కొనేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. బీజేపీ తరపున కేంద్రమంత్రులు, 120 మంది ఎంపీలు ప్రచారం చేశారు. కానీ ఆప్‌ను కేజ్రీవాల్ ఒక్కడే అన్నీతానై నడిపించారు. ఎవరూ ఊహించని విధంగా పార్టీకి ఘనవిజయం అందించారు. గతంలో 28 సీట్లు గెల్చుకున్న ఆప్ తర్వాత 67 స్థానాల్లో సంచలన విజయం సాధించింది. బీజేపీని కేవ‌లం 3 స్థానాల‌కే ప‌రిమితం చేసింది. ఇక కాంగ్రెస్ తొలిసారిగా అక్క‌డ ఉనికిని కోల్పోయింది.

త‌రువాత 2020లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ 62 సీట్ల‌తో మ‌రోసారి ఘ‌న‌విజ‌యాన్ని నమోదు చేసింది. ఢిల్లీలో మొదలైన ఆప్‌ ప్రస్థానం చరిత్రను తిరగారాస్తూ సాగుతూనే ఉంది. సంప్ర‌దాయ పార్టీల‌కు భిన్నంగా ధ‌న ప్ర‌భావానికి దూరంగా రాజ‌కీయాలు సాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా చైత‌న్య‌వంత‌మైన స‌మాజం అవినీతి ర‌హిత‌, అభివృద్ధి స‌హిత పాల‌న కావాల‌ని కోరుకుంటోంది.

ఇందుకే త‌న పార్టీనే ఏకైక ప్ర‌త్యామ్నాయ‌మ‌నే విష‌యాన్ని ఆప్ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఆప్‌ను రోల్‌మోడ‌ల్‌గా జ‌నానికి చూపుతున్నారు. ఢిల్లీలో రెండోసారి అధికారంలో కొనసాగుతున్న కేజ్రీ తమ ప్రస్థానం ఢిల్లీ, పంజాబ‌్‌తో ఆపేందుకు సిద్ధంగా లేరు. గోవా, ఉత్తరాఖండ్, ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోనూ తన ప్రాభ‌వాన్ని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇప్పటికే సర్వేలు సైతం చేయించినట్లుగా తెలుస్తోంది. పంజాబ్‌లో ఆప్‌ ఘన విజయంతో నాన్ కాంగ్రెస్ - నాన్ బీజేపీ పార్టీలకు కేజ్రీవాల్‌ దిక్సూచీగా మారారు. ఆప్ నేతలు భావి ప్రధాని అంటూ కేజ్రీవాల్‌ను ఆకాశానికెత్తుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం..ప్రధాని మోదీని రాజకీయంగా వ్యతిరేకించే పార్టీలైన టీఎంసీ, డీఎంకే, టీఆర్ఎస్, సమాజ్ వాదీ, శివసేన, టీఆర్ఎస్ వంటి పార్టీలు తమ రాష్ట్రాలకే పరిమితం.

కానీ, ఆప్ మాత్రం రెండు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుని జాతీయ పార్టీగా అవతరించింది. దీంతో కేజ్రీవాల్ కు అండగా నిలిచేందుకు వివిధ ప్రాంతీయ పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది. సరైన నాయకత్వం లేని, సంస్థాగతంగా బలహీనపడిన కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇందులో భాగంగానే పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లపై దృష్టిని కేంద్రీకరించిందని చెబుతున్నారు.

కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకుని ఆపార్టీని బలహీనపరచడం ద్వారా భవిష్యత్తులో బీజేపీకి జాతీయస్థాయి సవాల్‌దారుగా ఆవిర్భవించవచ్చని కేజ్రీవాల్ గట్టిగా భావిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. అటు రాజకీయాలపై ప్రజల్లో గూడు కట్టుకున్న ఆగ్ర‌హ‌మే ఆప్ ఎదుగుద‌ల‌కు ప్ర‌ధాన కార‌ణంగా విశ్లేష‌కులు చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి విప‌క్షాల త‌ర‌పున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా కేజ్రీవాల్ ఆవిర్భ‌వించినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story