Kejriwal: కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేజ్రీవాల్ విడుదలయితే కేసు దర్యాప్తునకు అటంకం కలిగే అవకాశం ఉందన్న ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకొన్న జడ్జి కావేరీ భవేజా ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
అనంతరం అధికారులు కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియటంతో అధికారులు కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరు పరిచారు. విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని, ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. విజయ్ నాయర్ అనే వ్యక్తి తనతో మాట్లాడలేదని, మంత్రులు ఆతిశీ, సౌరవ్ భరద్వాజ్‌లతో మాట్లాడారని కేజ్రీవాల్ విచారణలో చెప్పారని ఈడీ రిమాండ్ అప్లికేషన్‌లో పేర్కొన్నది.
తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారించనున్నది. జైలుకు వెళ్లిన ఆప్ నేతల్లో కేజ్రీవాల్ నాలుగో వ్యక్తి కావడం గమనార్హం. అంతకుముందు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు పలు కేసుల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, అంతకుముందు కోర్టులోకి ప్రవేశించే ముందు కేజ్రీవాల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన అరెస్టును ఉద్దేశించి మాట్లాడుతూ ‘ప్రధానమంత్రి చేస్తున్నది… ఈ దేశానికి మంచిది కాదు’ అని వ్యాఖ్యానించారు. కోర్టుకు కేజ్రీవాల్ భార్య సునీతతోపాటు ఢిల్లీ మంత్రులు ఆతిశీ, సౌరవ్ భరద్వాజ్ హాజరయ్యారు.
కేజ్రీవాల్‌ను ఎంతకాలం జైల్లో ఉంచినప్పటికీ, ఢిల్లీ సీఎంగా ఆయనే కొనసాగుతారని ఆప్ నేత జాస్మిన్ షా పేర్కొన్నారు. సీఎంగా ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు ఆయన రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేశారని, అది ఆయన బాధ్యత అని అన్నారు. జాస్మిన్ షా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం పాలసీ కేసులో ఆతిశీ, భరద్వాజ్ పేర్లను తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్‌ను ఖతం చేయాలంటే కేజ్రీవాల్‌ను మాత్రమే జైలుకు పంపిస్తే సరిపోదని బీజేపీ భావిస్తున్నదని ఆరోపించారు. మరోవైపు రానున్న రోజుల్లో పార్టీలో కేజ్రీవాల్ భార్య సునీత కీలక పాత్ర పోషించనున్నారని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com